ఆచార్య ఎన్జీ రంగా కళాశాలలో అగ్రగామిగా ఇంక్యుబేటర్
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పోషణ ఇంక్యుబేటర్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే అగ్రగామిగా యూనివర్సిటీ నిలిచిందని వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అన్నారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఆర్‌ఏఆర్‌ఎస్) సంయుక్తంగా వ్యవసాయ, అనుబంధ రంగా ల్లో కొత్త ఆవిష్కరణలకు మద్దతుగా వ్యవసాయ అంకుర సంస్థలకు గ్రాంట్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీతోపాటు ఇతర అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడో బ్యాచ్‌కి (ప్రీ– సీడ్ కేటగిరీ) ఒకే విడతలో మొత్తం గ్రాంట్, ఐదో బ్యాచ్‌కు (సీడ్ కేటగిరీ) రెండో విడత గ్రాంట్‌తోపాటు కార్యక్రమంలో మొత్తం 11 స్టార్టప్‌లకు గ్రాంట్‌లను అందజేశారు. అందరికీ కలిపి రూ. 55 లక్షలు గ్రాంటును వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అందజేశారు. అలాగే ఏడో బ్యాచ్ ప్రీ–సీడ్ స్టార్టప్‌లతో ఏన్‌జీఆర్‌ఏయూ పోషణ ఇంక్యుబేటర్ పరస్పర అవగాహన ఒప్పందాల (ఎంఓయు)కు సంతకాలు, ఐదో బ్యాచ్ కోహోర్ట్ సీడ్ స్టేజ్ ఇంక్యుబేటర్‌తో అనుబంధ అవగాహన ఒప్పందాల(సప్లమెంటరీ ఎంఓయూ)ను చేసుకున్నారు. వీసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏఎన్‌జీఆర్‌ఏయూ పోషణ ఇంక్యుబేటర్ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. యువత కొత్త ఆలోచనలతో వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చేలా ప్రయత్నించాలన్నారు.


