అపాచీ పరిశ్రమలో వ్యక్తి ఆత్మహత్య
తడ: అపాచీ పరిశ్రమలోని మరుగుదొడ్డిలోకి వెళ్లి దార్ల యుగంధర్(47) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మాంబట్టులోని అపాచీ బూట్లు తయారీ పరిశ్రమలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, కార్మికులు కథనం మేరకు.. నాయుడుపేట మండలం తన్నమాల గ్రామానికి చెందిన యుగంధర్ అనే వ్యక్తి మాబంట్టు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో ఉన్న అపాచి బూట్లు తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడు రోజూలాగనే విధులకు హాజరైన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్లాంట్–బీ సెక్షన్‌లోని మరుగుదొడ్డిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశుద్ధ్య కార్మికులు మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వెళ్లారు. లోపల గడి పెట్టి ఉండడంతో పలుసార్లు డోర్ తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేసుకుని, తలుపు పగులగొట్టి చూడగా గదిలోని ఓపైపునకు తాడుతో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ కొండప్పనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత..
ఓజిలి: కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకుని కాకాని మౌనిక(18) మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, రెవెన్యూ అధికారులు కథనం మేరకు.. కురుగొండ ఎస్సీ కాలనీకి చెందిన కాకాణి మౌనికను వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్‌కు ఇచ్చి మూడు నెలలు కిందట పెద్దలు వివాహం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు కురుగొండలో అమ్మ మస్తానమ్మ ఇంటికి దంపతులు వచ్చారు. అమ్మతో కలసి పండుగ మూడురోజులు ఆనందంగా గడిపారు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత సేపటికి మౌనిక తలుపులు తీయకపోవడంతో భర్త ప్రశాంత్, స్థానికులకు అనుమానం వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉంది. దీంతో తలుపులు పగులకొట్టి మౌనికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. ఈ విషయమై మస్తానమ్మ సమీప బంధువు బల్లి హైమావతి, ఆమె భర్త రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్ కొండాపురం వెళ్లి మౌనిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకునిచ పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్వో కురుగొండలో స్థానికులు, బంధువులు నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


