హెచ్‌ఐవీలో ఏపీ రెండో స్థానం
తిరుపతి అర్బన్: దేశంలో హెచ్‌ఐవీ రోగులు అధికంగా ఉన్న రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్టినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు వెల్లడించారు. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి హెచ్‌ఐవీకి చెందిన మందుల శాతం తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు కమిటీ సభ్యులు, కమిటీ ఇన్‌చార్జి విశ్వనాథం, అప్సక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డితో కలసి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఐవీపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ ఉన్నవారిపై వివక్ష చూపడం చట్టరీత్య నేరంగా భావించాల్సి ఉందని చెప్పారు. అలాగే వారి గోప్యత హక్కు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై ఓ విలేకరి ప్రశ్నిస్తే...ఆ అంశంపై మరోసారి మాట్లాడుదాం...ఇది వేదిక కాదంటూ సమాధానం దాటవేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి, శ్రావణిశ్రీ, గాలి భాను ప్రకాష్, కన్నా లక్ష్మీనారాయణ, వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రఘునందన్, డీపీహెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యూ డాక్టర్ పద్మావతి, డీఆర్వో నరసింహులు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, డాక్టర్ శైలజ, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉష కళావత్, రిజిస్టార్ అపర్ణ, డిప్యూటీ రిజిస్టార్ రెడ్డి, డీసీహెచ్‌ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు.


