పరిశోధనలు కొనసాగాలి
చంద్రగిరి: సమగ్ర పంటలు, ఆరోగ్య యాజమాన్యంపై నిరంతరం పశోధనలు కొనసాగించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి అన్నారు. తెగుళ్ల శాస్త్ర విభాగం ఇండియన్ ఫైటో పాథలాజికల్ సొసైటీ, సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు, సింపోజియం మంగళవారం ఎస్వీ అగ్రికల్చర్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్ల యాజమాన్యంతో పాటు సమగ్ర మొక్కల ఆరోగ్య యాజమాన్యం, సుస్థిర సాగు పద్ధతులపై పరిశోధనల ద్వారా ఆహార భద్రతను సాధించవచ్చని పిలుపునిచ్చారు. అనంతరం గౌరవ అతిథిగా విచ్చేసిన వియత్నం దేశ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గుయన్ డాక్ కోవా మాట్లాడుతూ సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులతో పంటల్లో తెగుళ్ల తీవ్రత పెరుగుతోందని, వీటిని నివారణకు భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఇండియన్ ఫైటో పెథాలాజికల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథన్, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.కృష్ణారెడ్డి, డాక్టర్ సిలియా షిమోగా, వ్యవసాయ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎంకే. నాయక్, డీన్ పీజీ స్టడీస్ డాక్టర్ ఏవీ రమణ, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివ నారాయణ, అసోసియేటెడ్ డాక్టర్ ఎం.రెడ్డిశేఖర్, కళాశాల తెగుళ్ల శాస్త్ర విభాగం డైరెక్టర్ డాక్టర్ వేమన తదితరులు పాల్గొన్నారు.


