వేమన గొప్ప తత్వవేత్త
తిరుపతి అర్బన్: యోగి వేమన గొప్ప తత్వవేత్తగా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వేమన జయంతిని పురస్కరించుకుని కలెక్టర్‌తోపాటు జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా కుల, మత, ఆర్థిక భేదాలను తీవ్రంగా ఖండిస్తూ సమానత్వం, మానవత్వం, సత్యం, నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు కృషి చేసిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలను ఎదిరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. వేమన రచించిన పద్యాలు సరళమైన ప్రజాభాషలో ఉండడంతో సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యాయని, వాటిలోని తాత్విక భావాలు నేటికీ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలిపారు. మానవుడు నిజాయితీగా, నైతికంగా జీవించాలనే సందేశాన్ని వేమన తన జీవితాంతం ప్రజలకు మంచిని అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, సెట్విన్ సీఈఓ యశ్వంత్, టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, ల్యాండ్ సర్వే రికార్డ్స్ జిల్లాధికారి అరుణ్‌కుమార్, ఏపీఐఐసీ జెడ్ ఎం భరత్ కుమార్ రెడ్డి, సెట్విన్ మేనేజరు మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


