అక్రమ నిర్బంధానికి 215 రోజులు
తిరుపతి రూరల్ : అక్రమ మద్యం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని 215 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధంలో పెట్టడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఆయనను జైలు పాలు చేశారని ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన రిమాండ్ పొడిగింపులో భాగంగా ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఆయనను చూసిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందారు. బరువు తగ్గి బలహీనంగా కనిపించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలో చెవిరెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పండుగలు, పర్వదినాల్లో చెవిరెడ్డిని తలుచుకునే ప్రతి కుటుంబం ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతోందని స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డికి బెయిల్ రాకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎప్పటికై నా చెవిరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


