పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఉద్యోగ విరమణ చేసిన రైల్వే, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ అనేది అత్యంత కీలకమైన అంశమని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తిరుపతి సీఆర్‌ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం ఎంపీ గురుమూర్తికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్లను బాధిస్తున్న ముఖ్య సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా 2025 సంవత్సరానికి ముందు ఉద్యోగ విరమణ చేసిన వారిని టర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో చేర్చకపోవడంతో వస్తున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చేయాలని వారు ఎంపీని కోరారు. ఈ అంశంపై స్పందించిన ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దేశ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు ఇప్పుడు పెన్షన్ రివిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షన్ రివిజన్ లేకపోవడం వీరికి తీవ్ర ఆర్థిక భారంగా మారిందన్నారు. వీరి నిజమైన హక్కు అయిన పెన్షన్ రివిజన్‌ను 8వ వేతన సంఘం టర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో చేర్చడం అత్యవసరమని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు గౌరవం, భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. పెన్షనర్లకు న్యాయం జరిగేలా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.


