ఇద్దరి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్: నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. బాపట్లకు చెందిన నవీన్(35) తిరుపతిలో డీఆర్ మహల్ వద్ద ఓ యవతిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. అతను కూడా తిరుపతిలోనే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 9 నెలల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నవీన్ బుధవారం రాత్రి నగరంలోని సాయి గణేష్ లాడ్జిలో రూమ్ తీసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాతయ్యగుంటలో మరొకరు..
నగరంలోని తాతయ్య గుంటలో నివాసముంటున్న చంద్రబాబు(35) పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బటన్ నొక్కాడు..
ఖాతా ఖాళీ అయ్యింది!
సైదాపురం: ఓ ట్రాన్స్‌కో ఉద్యోగికి తన మొబైల్‌కు వచ్చిన ఓ యాప్ బటన్ నొక్కడంతో బ్యాంకులో అతని ఖాతాలో ఉన్న రూ.14 వేలు నగదు సైబర్ నేరగాళ్ల దోచుకున్నారు. ఈ సంఘటన సైదాపురంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. సైదాపురం గ్రామానికి చెందిన నలగర్ల చెంచుకృష్ణ స్థానిక సబ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో గురువారం అతని మొబైల్‌కు ఓ యాప్ వచ్చింది. ఆ యాప్‌లో ఈకైవెసీ చేయాలంటూ సమాచారం రావడంతో ఆయాప్‌ను క్లిక్ చేశారు. వెంటనే చెంచుకృష్ణకు సంబంధించి కలిచేడు ఎస్‌బీఐ బ్యాంకులో రూ.14,597 నగదు మాయం అయ్యింది. కేవలం రూ.7 మాత్రమా మిగిలింది. దీంతో బాధితుడు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
దొరవారిసత్రం: మండల కార్యాలయాలకు సమీపంలో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనారోగ్యంతోనే గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.


