వితంతుల వేదన పెంఛెన్‌ ! | - | Sakshi
Sakshi News home page

వితంతుల వేదన పెంఛెన్‌ !

Sep 5 2025 4:54 AM | Updated on Sep 5 2025 5:48 AM

పింఛన్లకు వితంతుల అగచాట్లు గ్రీవెన్స్‌లో అర్జీలు ఇస్తున్నా మంజూరు కానీ వైనం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటున్న అధికారులు 15 నెలలుగా నిరీక్షణ వైఎస్సార్‌ పాలనలో 40–60 రోజుల్లో పింఛన్లు మంజూరు 11 వేల మంది వితంతుల ఎదురుచూపులు

తిరుపతి అర్బన్‌ : ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటున్న భర్త మృతి చెందితే..ఆ కుటుంబంలోని భార్యతో పాటు బిడ్డలు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ కష్టాన్ని గుర్తించిన దివంగత నేత వైఎస్‌ఆర్‌ వితంతులైన వారికి 40 నుంచి 60 రోజుల్లో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. ప్రధానంగా వితంతుల పింఛన్లకు మాత్రం ప్రత్యేక మినహాయింపు ఇచ్చి రెండు నెలల వ్యవధిలో పింఛన్లు మంజూరు చేస్తూ వస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలుగా ఒక్కటంటే ఒక్క వితంతు పింఛన్‌ మంజూరు చేయలేదు. ఈ అంశంపై వితంతులు అధికారుల చుట్టూ పింఛన్‌ మంజూరు చేయాలని తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు.

జిల్లాలో 11,320 మంది వితంతులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి. ఏడాదిన్నరగా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఆరు నెలలుగా పలువురు వితంతులు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ సందర్భంగా పింఛన్ల కోసం విన్నపాలు ఇస్తున్నా ప్రయోజనం చేకూరక ఇక్కట్లు పడుతున్నారు.

న్యాయం చేయాలని కలెక్టర్‌లో విన్నపాలు

భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన వితంతులు తమ బిడ్డలను ఇంటి వద్ద చూసుకునే వారు లేకపోవడంతో వారితో కలిసి కలెక్టరేట్‌లో అర్జీలను అందిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తమ గోడును కనిపించిన అధికారికల్లా విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ప్రతి సోమవారం పదుల సంఖ్యలో వితంతులు పింఛన్ల కోసం అర్జీలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీఓల వద్ద మొరపెట్టుకున్నా ఉపయోగం లేకపోవడంతో ఇటీవల కాలంలో అంతా కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అర్జీలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని చెబుతున్నారు. ఎప్పుడు అనుమతి వస్తాయో తెలియడం లేదు. 2023 డిసెంబర్‌ 1 నుంచి 2024 అక్టోబర్‌ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటూ భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వారు 6 వేల మందికి పైగా ఉంటే అందులో 4 వేల మందికి మాత్రమే అందించారు. అందులోనూ మెలిక పెట్టడంతో ఎందరో పింఛన్లు రాక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.

పింఛన్‌ ఇప్పించి ఆదుకోండి

ఈమె పేరు రేణుక. భర్త మోహన్‌రాజ్‌ గుండెపోటుతో పది నెలల కిందట మృతి చెందాడు. ఇద్దరు బిడ్డలున్నారు. తిరుపతి నగరంలోని ఎస్‌బీఐ కాలనీలో చిన్నపాటి అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. ఆమెకు కన్న (13) అనే కుమారుడు, చామంతి(8) అనే కుమార్తె ఉన్నారు. అంతేకాకుండా ఆమెతో పాటు తమ తల్లి విజయమ్మ ఉంటోంది. నలుగురు జీవనం సాగించాల్సి ఉంది. ఏ ఆధారం లేదు. ఆమెకు వితంతు పింఛన్‌ ఇవ్వకపోవడంతో తమ బిడ్డలతో కలిసి పదే పదే కలెక్టరేట్‌లో అర్జీలు ఇస్తున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బతుకు ప్రశ్నార్థకంగా మారింది.

– తమ ఇద్దరు బిడ్డలతో కలెక్టరేట్‌లో రేణుక, తిరుపతి

సాయం చేయండి

ఈమె పేరు షబినా, శ్రీకాళహస్తి పట్టణంలోని కుమారస్వామి వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త మృతి చెందాడు. తమ చిన్న బిడ్డతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి వితంతు పింఛన్‌ ఇప్పించండి అంటూ తిరుగుతున్నారు. తమకు ఏ ఆధారం లేకపోవడంతో ఇటు పింఛన్‌ లేకపోవడంతో కష్టాలు పడుతున్నానంటూ తమ గోడును వినిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదంటూ చెప్పి పంపేస్తున్నారు.

– పురిటి బిడ్డతో కలెక్టరేట్‌లో షబినా,

శ్రీకాళహస్తి పట్టణం

ఇద్దర బిడ్డల పోషణ భారంగా ఉంది

ఈమె పేరు ఉయ్యాల ధనమ్మ, ఓజిలి మండలం కరబల్లవోలు గ్రామం. ఆమె భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆమెకు దీక్షిత, అకిరా నందన్‌ అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. గ్రామానికి వచ్చి విచారణ చేపట్టండి. అన్ని విధాల పింఛన్‌కు అర్హురాలును అంటూ విలపిస్తోంది. ఏ ఆధారం లేదు. వితంతు పింఛన్‌ ఇప్పిస్తే ఆ డబ్బులతో ఇద్దరి బిడ్డలను పోషించుకుంటానని గురువారం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ను కలవడానికి తమ ఇద్దరి బిడ్డలతో వచ్చి తమ గోడు వినిపించారు.

– తమ ఇద్దరు బిడ్డలతో కలెక్టరేట్‌లో ఉయ్యాల ధనమ్మ,

ఓజిలి మండలం, కరబల్లవోలు గ్రామం

వితంతుల వేదన పెంఛెన్‌ !1
1/2

వితంతుల వేదన పెంఛెన్‌ !

వితంతుల వేదన పెంఛెన్‌ !2
2/2

వితంతుల వేదన పెంఛెన్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement