
చంద్రగిరి మండలంలో పేకాటాడుతున్న చిత్రం (ఫైల్)
జిల్లాలో జోరుగా పేకాట శిబిరాలు
రోజుకు రూ.2 నుంచి 3 కోట్ల లావాదేవీలు
టీడీపీ నేతలకు 20 శాతం, అధికారులకు 10 శాతం మామూళ్లు!
రోడ్డున పడుతున్న పేదలు, దిగువ తరగతి కుటుంబాలు
లొకేషన్లు చేర్ చేస్తూ ఆడిస్తున్న వైనం
ప్రతి రోజు చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
తిరుపతి జిల్లాలో పేకాట శిబిరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొంత మంది కూటమి నేతలే నిర్వాహకులుగా మారి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కొన్ని లాడ్జీలు, హోటళ్లు , శివారు ప్రాంతాలు ఒకటేమిటి..ఎక్కడపడితే అక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తూ దందా సాగిస్తున్నారు
టాస్క్‌ఫోర్స్ : కాలక్షేపం కోసం కొందరు.. కాసుల కోసం మరికొందరు.. అలవాటు మానుకోలేక ఇంకొందరు ఇలా జూదానికి అలవాటు పడుతున్నారు. గత ప్రభుత్వం పేకాటపై నిఘా పెట్టడంతో జూదగాళ్లందరూ అలవాటు మానుకొని కుటుంబాలతో సంతోషంగా గడిపేవారు. ఎప్పుడైతే పచ్చదండు చేతికి పగ్గాలు వచ్చాయో.. పేదవాడి చేతికి పేక ముక్కలు చేరిపోయాయి. దీంతో తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా పేకాట మొదలైంది. హోటల్లు, లాడ్జీలు, నగర శివారు ప్రాంతాలలో విచ్చలవిడిగా పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వీళ్లను ఆసరాగా తీసుకుని నిర్వాహకులు రూ. కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి.
కూటమి బడా నేతలకు ముడుపులు
శ్రీకాళహస్తిలో ఓ ప్రధాన నాయకుడు రోజుకు ఒక పల్లెలో పేకాట శిబిరాన్ని ఆడిస్తున్నట్లు సమాచారం. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారికి ఫోన్ల ద్వారా తెలిపి వారు చెప్పిన లొకేషన్లో ఆట జరుగుతున్నట్లు సమాచారం ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ఇలా ఆటను అనుమతిస్తూ ఆటంకాలు రాకుండా చూసుకున్న బడా నాయకులకు కూడా నెలవారి మామూళ్లను లక్షల్లో ముడుపులుగా చెల్లించినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా అడపాదడపా దీనిపై కేసులు నమోదు చేస్తున్నా.. నిర్వాహకులు మారడంలేదు.
చేతులు మారుతున్న రూ.కోట్ల వ్యాపారం
పేకాట శిబిరాలతో జిల్లాలో ప్రతిరోజు సుమారు రెండు నుంచి మూడు కోట్లు చేతులు మారుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ఇందులో సుమారు 20 శాతానికి పైగా ఆదాయం టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళుతుండగా మరో 10 శాతం ఆదాయం అధికారుల జేబులను కూడా తడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతలే నిర్వాహకులు కావడంతో ఆటాడే ప్రాంతం పోలీసులకు తెలిసినా కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పేకాట ఆడిస్తూ కొందరు లాభాలు గడిస్తుంటే మరికొందరు భార్య మెడలో ఉన్న పుస్తెలు కూడా అమ్ముకుని రోడ్డున పడుతున్నారు.
ఉదయం వెళ్లి సాయంత్ర వరకూ అక్కడే మకాం
జూదానికి అలవాటుపడిన వారు ఉద్యోగానికి వెళ్లే వారి లాగానే ఉదయం వెళ్లి సాయంత్రం వరకు, కొన్ని సందర్భాల్లో రాత్రుల్లోనూ అక్కడే గడుపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఆడేవారంతా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు హోటళ్లు, లాడ్జీల్లో గదులను అద్దెకు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొన్ని లాడ్జీల్లో పేకాడుతూ పలువురు పట్టుబడ్డారు. వాస్తవానికి లాడ్జీల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం నేరం. కానీ, గిరాకీలు లేవనో, గదులు ఖాళీగా ఉన్నాయన్న కారణంతోనో తెలిసినవారున్నారనో.. మొత్తానికి కొంత మంది జూదరులకు సహకరిస్తున్నారు. కొన్ని సంఘ భవనాలు సైతం దీనికి మినహాయింపు కాదు. ఖాళీ సమయాల్లో సమావేశాలు, పిచ్చాపాటిగా మాట్లాడుకునేందుకు వేదికగా పేర్కొంటూనే అంతర్లీనంగా ఇక్కడ పేకాటను కొనసాగిస్తున్నారు. వచ్చినవారంతా ఆర్థికంగా ఉన్నవారు కావడంతో ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు జూదంలో పెట్టేస్తున్నారు. బయటి వ్యక్తులు ఏమాత్రం అనుమానించే అవకాశం లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తమకు తెలిసిన వారిని సైతం ఆహ్వానించి పేకాటను కొనసాగిస్తున్నారు.
శివారు ప్రాంతాల్లోనూ వదలట్లే..
కేవలం అద్దె గదుల్లోనే కాదు.. శివారు ప్రాంతాలనూ లక్ష్యంగా చేసుకొని కొంత మంది జూదాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దూరంగా ఉండే ప్రాంతంలో చెట్ల కింద, తోటలు, పంట పొలాలను వేదికగా మార్చుకుంటున్నారు. ఆడేవారికి మినహా ఇతరులకు ఏమాత్రం సమాచారం లేకుండా ఔత్సాహిక సభ్యులు బృందంగా ఏర్పడి తాము నిర్ణయించుకున్న స్థలానికి చేరుకుంటున్నారు. మద్యం తాగడం, భోజనం చేయడం అక్కడే కానిస్తున్నారు. సమయానికి డబ్బులు లేకపోతే అప్పులు చేసో, ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టో ఆట కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది.
పుట్టగొడుగుల్లా పేకాట కేంద్రాలు
తిరుపతి జిల్లా పరిధిలో కొద్ది రోజులుగా పేకాట కేంద్రాలు టీడీపీ కనుసన్నల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి పుత్తూరు, రేణిగుంట, వెంకటగిరి, సూళ్లూరుపేట ప్రాంతాలలో జూదాల నిలయాలు వెలుస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులే నిర్వాహకులుగా మారి రోజుకు రూ. లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఆటను బట్టి రేట్లు కుదిరించుకుంటున్నారు. రోజుకు ఒక స్థావరం, ఒక ప్రాంతం అంటూ ఎంచుకుంటూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు.
భయపడటం లేదు..
పేకాట ఆడుతూ పట్టుబడుతున్న సంఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ జూదానికి అలవాటుపడ్డ వారు ఏమాత్రం భయపడటం లేదు. ఒకవేళ పోలీసులకు పట్టుబడినా పెద్దగా శిక్షలు లేకపోవడంతో, న్యాయస్థానంలో జరిమానా కట్టి బయటకు రావచ్చన్న ధీమానే వీరిని మళ్లీ మళ్లీ పేకాట వైపు మళ్లిస్తోందనే విమర్శలున్నాయి.
బుగ్గిపాలవుతున్న జీవితాలు
పేకాటకు అలవాటు పడిన వ్యక్తులకు గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఆన్లైన్లోనూ ఫిజికల్‌గాను అడ్డుకట్ట వేసింది. తిరిగీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూటమి నేతలు పేదవారి జీవితాలతో పేకాట ఆడుతున్నారు. అక్కడా.. ఇక్కడ అని తేడా లేకుండా.. జిల్లా అంతటా విచ్చలవిడిగా పేకాట సాగుతోంది. దీనికి నిదర్శనం ఇటీవల సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేనే.. సీఎంతో మాట్లాడుతాం.. పేకాట క్లబ్బులు జరిపిస్తాం.. జనాల మైండ్ సెట్ ను పోగొడతామంటూ... కారు కూతలు కూసింది.. తెలిసిందే. ఈ మాటలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో పేకాట రాయుళ్లు నిర్వాహకులకు కూడా కొండంత ధైర్యం.. కొండంత అండ.. బలం చేకూరింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా పేకాట ఆడిస్తూ పేదల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు.
స్ట్టేషన్‌కు కూతవేటు దూరంలో..
తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న స్టేషన్‌కు కూతవేటు దూరంలో టీడీపీ బడా నేత లాడ్జీలో రోజుకు లక్ష నుంచి 2 లక్షల వరకు తీసుకుంటూ పేకాటను ఆడిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా కూడా లాడ్జీ ఓనర్లకు, పెద్ద స్టార్ హోటళ్లకు పెద్ద మొత్తంలో నగదును ఆశ పెట్టి రూములు తీసుకొని ఆటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు వస్తే కూడా మేము చూసుకుంటామంటూ భరోసా కల్పిస్తున్నారు. అంతే కాకుండా రోజుకో ప్రాంతంలో చోటు మారడంతో ఎవరికీ కూడా అనుమానం రాకుండా ఆటలు జరుగుతున్నాయి. అంతే కాకుండా నగరంలో మరోచోట టీటీడీలో ఉన్నత స్థాయి పోస్టులో రిటైర్డ్ అయిన మాజీ ఉద్యోగి కూడా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేకాట రాయుళ్లు చెబుతున్నారు.
శిబిరాల్లో అన్ని సౌకర్యాలు
పేకాట ఆడే అందుకు వచ్చిన వారికి సకల సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, మద్యం, మాంసం, సిగరెట్లు, సకాలంలో అందిస్తూ.. వీరికి సర్వింగ్ చేయడానికి కొంత మందిని ఏర్పాటు చేస్తున్నారు. ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూరుస్తున్నారు.