
తెలుగు తల్లి విగ్రహం వద్ద టీచర్ల నిరసన
తిరుపతి సిటీ : తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) నాయకులు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నిరసన తెలిపారు. ఈ మేరకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దొడ్డ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. భాషోపాధ్యాయులను క్లస్టర్, పీఎస్, హెచ్‌ఎం పోస్టుల నుంచి తప్పించి భాషోపాధ్యాయ విధుల్లో నియమించాలని డిమాండ్ చేశారు. భాషా పండితులకు హైకోర్టు తీర్పును అమలు చేస్తూ పదోన్నతులు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుత నిరసన తెలియజేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటయ్య, రాష్ట్ర కార్యదర్శి పట్టాభిరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ జిల్లా గౌరవ సలహాదారు ఈశ్వరయ్య, నేతలు వాసుదేవయ్య, గురుస్వామి, రాఘవేంద్ర, భాషోపాధ్యాయులు పాల్గొన్నారు.