
నూతన విద్యా విధానంతో దేశాభివృద్ధి
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంతో సత్వర దేశాభివృద్ధి చెందుతుందని ఎస్వీయూ వీసీ అప్పారావు తెలిపారు. ఏబీఆర్‌ఎస్‌ఎం, వాయిస్ ఆఫ్ తిరుపతి అకడమీషియన్స్ సంయుక్తంగా ఎన్‌ఈపీ–2020 విధానాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఎస్వీయూ సెనేట్ హాల్‌లో బుధవారం ఎన్‌ఈపీ – 2020 ఎట్ ది రేట్ ఫైవ్ ఇయర్స్, పాలసీ, ప్రాక్టీస్ అండ్ ప్రోగ్రెస్ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం 2020లో నూతన విద్యావిధానాన్ని ప్రారంభించిందని తెలిపారు. గత ఐదేళ్లుగా కేజీ టూ పీజీ వరకు ఎన్‌ఈపీని అమలు చేస్తున్నారని తెలిపారు. ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ మాట్లాడుతూ చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అంతా మాతృభాషలోనే జరుగుతుందని తెలిపారు. భారతదేశంలో విద్యార్థి అభిరుచికి అనుగుణంగా మాతృభాషలోనే విద్యను బోధించే అవకాశాన్ని నూతన జాతీయ విద్యా విధానం కల్పిస్తుందని తెలిపారు. దేశంలో వున్న అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం బడ్జెట్లో కేటాయిస్తున్న జీడీపీ కనీసం 6 శాతం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని, తరగతి గదులను ఆధునీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు వైవీ రామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ సి.వాణి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం రాజశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి రాజశేఖర్ , డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ఎన్ బాలసుబ్రమణ్యం, ప్రొఫెసర్ రంజని, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సంధ్య, హైదరాబాద్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు, వాయిస్ ఆఫ్ తిరుపతి అకడమిషియన్స్, పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, 300 మంది విద్యావేత్తలు పాల్గొన్నారు.