అనధికార వ్యక్తులు తిరుమల ఖాళీ చేయాల్సిందే
తిరుమల : తిరుమల భద్రతలో భాగంగా టీటీడీ సీవీఎస్వో వీ.హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో పోలీసులతోపాటు విజిలెన్స్, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా శ్రీవారి మెట్టు, ఆదిశేషు అతిథిగృహం, ఎంబీసీ–34 ప్రాంతంతోపాటు ఎస్‌ఎంసీ, ఏటీటీ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు కూలి పనులపై వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు. అదేవిధంగా తిరుమలలో అనధికారికంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించి వారిని అక్కడి నుంచి పంపిచేశారు. తిరుమలలో నిర్మాణాలను పరిశీలించి ఆయా ప్రాంతాలను బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని ఫొటోగ్రాఫర్స్, పండ్ల దుకాణాలు, బడ్డీ కొట్టులను పరిశీలించారు. అనధికార వ్యక్తులు వెంటనే తిరుమల ఖాళీ చేయాలని హెచ్చరించారు.


