అచ్చ తెలుగులో అన్నమయ్య కీర్తనలు | - | Sakshi
Sakshi News home page

అచ్చ తెలుగులో అన్నమయ్య కీర్తనలు

May 25 2024 1:00 AM | Updated on May 25 2024 1:00 AM

అచ్చ తెలుగులో అన్నమయ్య కీర్తనలు

అచ్చ తెలుగులో అన్నమయ్య కీర్తనలు

తిరుపతి కల్చరల్‌ : అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అన్నమయ్య పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందారని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ రామ సూర్యనారాయణ తెలిపారు. అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాహిత్య సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సుకు అధ్యక్ష వహించిన రామ సూర్యనారాయణ తాళ్లపాక కవులు– పద కవిత్యం అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య సతీమణి తిమ్మక్క సుభద్ర కల్యాణం, కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు ద్విపదలో హరివంశం, మనువడు చిన్నన్న ఉషాపరిణయం, అన్నమయ్య చరిత్ర వంటి ద్విపద కవితలను సామాన్యులకు అర్థమయ్యేలా గొప్ప సాహిత్య విలువలతో రచించారని కొనియాడారు. వంశమంతా కవులైన ఖ్యాతి తాళ్లపాక వంశానికే దక్కుతుందన్నారు. అన్నమయ్య పద కవిత్యాన్ని భక్తిపథ కవిత్వంగా మార్చారని వివరించారు. ఆంధ్ర వర్సిటీ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ మలయ వాసిని అన్నమయ్య కీర్తనలు– వస్తు వైవిధ్యం అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య మధుర భక్తితో వస్ర్త్రాశయ సాహిత్యం, ఆత్మాశ్రయ సాహిత్యం అనే రెండు అంశాలతో సంకీర్తనలను రచించినట్లు తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మిక విభాగంలో నాలుగు సంపుటాలు, శృంగారం విభాగంలో 22 సంపుటాలుగా విభజించినట్లు వివరించారు. కాకతీయ వర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ కాత్యాయనివిద్మహే అన్నమయ్య పద కవితలు–లౌకిక విలువల అనే అంశంపై మాట్లాడారు. లౌకిక జీవితం లేకుండా భక్తి లేదని, సమాజంలో, వ్యక్తిగతంగా ఉన్న సమస్యల పట్ల ఆందోళన చెందుతున్న సందర్భంలో భక్తులు అవుతారని తెలిపారు. అన్నమయ్య అనాటి సామాజిక పరిస్థితుల్లో ఆకలి, కష్టాలు భగవంతుడిని గుర్తు చేస్తాయని, తన కీర్తనల ద్వారా తెలిపారని వెల్లడించారు. కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు విభీషణ శర్మ పాల్గొన్నారు.

ప్రియ సిస్టర్స్‌ గానామృతం

అన్నమాచార్య కళామందిరంలో చైన్నెకి చెందిన ప్రియ సిస్టర్స్‌ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రవణానందకరంగా సాగాయి. అన్నమయ్య సంకీర్తనలను తమదైన శైలిలలో సుమధురంగా గానం చేస్తూ భక్తుల హృదయాలను మైమరిపించారు. ఈ క్రమంలో తొలుత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్‌రావు బృందం ప్రదర్శించిన భక్తి సంగీతం సభికులను అలరింపజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement