ఈసారీ పాత ధరలే
ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
మేఘం కురిసింది.. అన్నదాత మురిశాడు.. కాడీ మేడీ పట్టి పొలం బాట పట్టాడు.. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ధాన్యం మొత్తం ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగొలు చేయాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఏపీ సీడ్స్ యాజమాన్యం ధాన్యం కొనుగోలుకు దూరం అయ్యింది. దీంతో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు పాత ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
తిరుపతి అర్బన్: ప్రభుత్వం నుంచి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే సాధారణంగా ఏటా పంట సాగు ఖర్చులు పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ పాలనలో రబీ సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యానికి ఏటా క్వింటాకు రూ.150 నుంచి రూ.200 ధర పెంచేది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ఈ రబీ సీజన్‌లోను గత ఏడాది ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధరలకే ఈ ఏడాది కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఏటా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. ఇంకోవైపు ఈ ఏడాది సాగు పెరగడంతో దిగుబడి అదనంగా 50 వేల టన్నులు ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది. అయితే తూతూ మంత్రంగా కొద్ది మోతాదులో ధాన్యం కొనుగోలు చేసి, మానుకుంటే కుదరదని రైతులు తెగేసి చెబుతున్నారు.
ఈ ఏడాది ఇలా...
ఈ ఏడాది శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ వారు ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో ఆ ధాన్యం కూడా అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తేనే రైతుల సమస్యలు తీరుతాయి. మరోవైపు గత ఏడాది ధరలే ఈ సారీ నిర్ణయించింది. అయితే పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది కన్నా ఈ ఏడాది క్వింటాల్‌పై రూ.150 నుంచి రూ.200 పెంచుతారని రైతులు ఆశపడ్డారు. వారి నిరాశగా మిగిలింది.
గత ఏడాదిలా..
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 1.85 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. 5.50 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. అందులో శ్రీకాళహస్తి ఏపీసీడ్స్ వారు వరి రకం ఆధారంగా క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.2,700 వరకు రైతులకు చెల్లించి.. 1.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389 వంతున, సాధారణ రకం ధాన్యానికి రూ.2,369 చొప్పున 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మిగిలిన 3.45 లక్షల టన్నుల ధాన్యంలో కొంత మేరకు రైతులు ఆహారం కోసం వినియోగించుకోగా, మిగిలిన ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు(క్వింటా రూ.1800 నుంచి రూ.1900 వరకు) విక్రయించారు.
ఈసారీ పాత ధరలే


