తిరుపతి తుడా: స్విమ్స్ కార్మికులు నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పలుసార్లు అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, కరపత్రాలు పంచి, నిరసనలు తెలియజేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలింది. కార్మికుల కష్టాన్ని వినియోగించుకుంటూ, వారి హక్కులను నిర్లక్ష్యం చేయడం యాజమాన్యం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్విమ్స్ కార్మికులు చేస్తున్న పోరాటం గురువారానికి 35వ రోజుకు చేరుకుంది. సమస్యల పరిష్కారానికి గడువుపై గడువు అడిగి చివరికి మాట తప్పడంతో కార్మికులను మోసం చేశారని ఇక ఓపిక నశించిందని, ఈనెల 5వ తేదీ నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా కార్మికులను తిప్పలు పెట్టిస్తూ, హామీలు ఇచ్చి మాట తప్పడం యాజమాన్యం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పరిష్కరించ గలిగే సమస్యలను కావాలనే లాగడం వెనుక ఉద్దేశం ఏమిటి? కార్మికుల సహనాన్ని పరీక్షించే ప్రయత్నం ఇక మానుకోవాలని హెచ్చరించారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి కార్మికులందరూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇది సాధారణ నిరసన కాదని యాజమాన్యాన్ని కుదిపే స్థాయిలో ఉద్యమం ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, నగర ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్, స్విమ్స్ యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.


