తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,647 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,644 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
తడ: కుమారుడి బైక్‌పై వెనుక కూర్చుని జాతీయ రహదారిపై వెళుతున్న మహిళ అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందిన ఘటన గురువారం తడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని పెరియవట్టు గ్రామానికి చెందిన సెల్వి(48) తడ బ్యాంకుకి వచ్చి పని ముగించుకుని కొడుకు మహేష్ బైక్‌పై తిరుగు ప్రయాణమైంది. పూడి పంచాయతీ సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్ వద్దకు వచ్చే సరికి రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో మహేష్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో పట్టు తప్పిన సెల్వి కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రెడ్‌హిల్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


