● యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
రేణిగుంట: మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వ్యక్తి వద్దకు గాజుల మండ్యం పోలీసులు చేరుకుని మంచి మాటలు చెప్పి, అతడి ప్రాణాలు కాపాడిన సంఘటన ఏర్పేడు మండలం గోవిందవరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు మండలంలోని గోవిందవరం గ్రామానికి సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న డిక్సన్ కంపెనీలో ఎఫ్‌ఎల్‌టీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎన్ శ్రీనివాసులు అనే వ్యక్తి, తన ఇష్టానికి వ్యతిరేకంగా, అతన్ని మరో ప్లాంట్‌కు బదిలీ చేశారని మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు యత్నిస్తున్నా డని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం అందింది. దీంతో ఆయన గాజులమండ్యం పోలీసుస్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్ ఆర్. మణి, హోంగార్డ్ లోకనాథంతో కలసి గాజులమండ్యం–తండ్లం మార్గంలోని రైల్వే వంతెన పక్కన ఉన్న బావి వద్ద నిలబడి ఉండగా, అతని వద్దకు వెళ్లారు. అతనికి మంచి మాటలు చెప్పి, ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపజేసి, అతని రక్తసంబంధీకులను పిలిపించి అప్పగించారు. సకాలంలో స్పందించి, ఆత్మహత్యాయత్నం నుంచి ఓ యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ మణి, హోంగార్డ్ లోకనాథంను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించినట్లు పోలీసులు తెలిపారు.
జేఈఈ పరీక్ష ప్రశాంతం
తిరుపతి సిటీ: తిరుపతి జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో జ రిగిన జేఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగిన పరీక్షలకు 91.23 శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
జూనియర్ జడ్జిగా తిరుపతి మహిళా న్యాయవాది
తిరుపతి లీగల్: జూనియర్ జడ్జిగా తిరుపతి మహిళా న్యాయవాది బీమా మోహనలక్ష్మి ఎంపికైనట్టు తిరుపతి న్యా యవాద సంఘ కార్యవర్గ సభ్యులు తెలిపారు. రాష్ట్ర హై కోర్టు గత ఏడాది జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించింది. తర్వాత ఆ పరీక్షలో ఎంపికై న న్యాయవాదులకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. జూనియర్ జడ్జి లుగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న అభ్యర్థుల ఫలితాలను రాష్ట్ర హైకోర్టు గురువారం సాయంత్రం విడుదల చేసింది. రెండింటిలోనూ న్యాయవాది మోహనలక్ష్మి మొదటి స్థానంలో ఎంపికై నట్టు వారు పేర్కొన్నారు. ఆమె తండ్రి బి. శ్రీరాములు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఎంపిక కావడంపై తిరుపతి న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడు గోపీచంద్, ఇతర కార్యవర్గ సభ్యులు,పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
తిరుపతి క్రైమ్ : నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు.. తిరుపతిలోని శ్రీచక్ర అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నంబర్ 202లో గోపాలపురం జి. వెంకటేష్ కుమారుడు లోహిత్ కుమార్ (29) నివాసముంటున్నాడు. అవివాహితుడైన లోహిత్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు నెల రోజుల క్రితం తిరుపతికి వచ్చి ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో, కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయడానికి వెళుతున్నానని తన తండ్రికి చెప్పి, తన ద్విచక్ర వాహనంలో ఇంటి నుంచి బయలుదేరాడు. అన్నారావు సర్కిల్ నుంచి నంది సర్కిల్ వైపు, రామకృష్ణ మిషన్ సమీపంలో వెళుతున్న సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన కియా కారెన్స్ కారు అతని వాహనాన్ని ఢీకొంది. దీంతో లోహిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మృతుడి తండ్రి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, లోహిత్ కుమార్‌ను రూయాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


