చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున కుంట్రపాకం హరిజనవాడలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం హరిజనవాడకు చెందిన మహేష్ బాబు(30) ఏడేళ్లకు ముందు వరదయ్యపాళేనికి చెందిన అఖిలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం ఆమెతో విడిపోయి, కడపకు చెందిన మీనా కుమారితో మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వీరి కాపురం భాకరాపేట నుంచి చంద్రగిరి దాసరవీధికి మార్చారు. అయితే మహేష్ బాబు ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా మారడంతో ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తరచూ వచ్చేవి. దీంతో మీనా కుమారి తిరిగి కడపకు వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మహేష్ బాబు అన్న ఇద్దరి మధ్య పంచాయితీ చేసి, సర్దుబాటు చేశాడు. అయితే అతనిలో మార్పు రాకపోవడంతో తాను కడపకు వెళ్లిపోతానంటూ మీనా కుమారి పలుమార్లు మృతుడితో తెలిపింది. నువ్వు వెళ్లిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆమెను బెదిరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మహేష్ ఇంట్లో నుంచి బహిర్భూమికి వెళుతున్నట్లు చెప్పి చున్నీ తీసుకుని ఇంటి సమీపంలోని మార్కెట్‌యార్డు ప్రహరీగోడను దూకాడు. కాసేపటికి అనుమానం వచ్చిన మీనా కుమారి అక్కడకు చేరుకుంది. మార్కెట్‌యార్డులోని ఓ చెట్టుకు మహేష్ బాబు ఉరివేసుకోవడం గమనించి, చున్నీను తీసి 108 సమాచారం అందించింది. వైద్య పరీక్షలను నిర్వహించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ ఉరి వేసుకుని మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తల్లి వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి తెలిపారు.


