– కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రికి ఎంపీ గురుమూర్తి వినతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్:గూడూరు పట్టణంలో దీర్ఘకాలంగా నిలిచిపోయిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నకి వినతిపత్రం అందజేశారు. 2008వ సంవత్సరంలో 99–ఏ, 99–బీ లెవల్ క్రాసింగుల స్థానంలో ఈ ఆర్వోబీకి అనుమతి ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు ఇది ఓ మార్గంగా చూపినట్లు తెలిపారు. గూడూరు రైల్వే జంక్షనన్‌గా ఉండడంతో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆర్వోబీ పూర్తి కాకపోవడంతో తరచుగా లెవెల్ క్రాసింగు గేట్లు మూసివేయడంతో ట్రాఫిక్ సమస్యలు, ఆలస్యాలు ఏర్పడటమే కాకుండా అంబులెన్స్‌లు,అగ్ని మాపక వాహనాల వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయనకి వివరించారు. అలాగే పారిశ్రామిక రవాణా, ఆర్థిక కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పరిధిలో సమగ్ర రవాణా సదుపాయాలు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఉందన్నారు. ఈ దశలో గూడూరు ఆర్వోబీ పూర్తి కావడం ఎంతో కీలకమని గుర్తు చేశారు. అలాగే గూడూరు రైల్వే స్టేషనన్‌లో పెండింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు, వెంకటగిరి, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో పలు ముఖ్య రైళ్లకు స్టాపింగ్‌లు కల్పించాలని గతంలో చేసిన వినతిని మరోసారి గుర్తు చేసినట్లు ఎంపీ తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.


