
ఐకేఎస్‌తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన భారతీయ జ్ఞానపరంపర విభాగం (ఐకేఎస్)తో తిరుపతి ఎస్వీ వేదిక్ వర్సిటీ ‘వైదిక వాజ్ఞ్మయ వ్యాసాల ప్రచురణ, తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్’పై శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వైదిక వాజ్ఞ్మయ వ్యాసాలను అధిక సంఖ్యలో ప్రచురించేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి ప్రచురించేందుకు మరో ఒప్పందం కుదిరిందని వివరించారు. అనంతరం జ్ఞానపరంపర విభాగ జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ జి.సూర్యనారాయణమూర్తితో ఎంఓయూ మార్చుకున్నారు. రిజిస్ట్రార్ రాధాగోవింద త్రిపాఠి, ఆచార్య గోలి సుబ్రమణ్యశర్మ, ప్రొఫెసర్లు రాధేశ్యామ్, పవన్‌కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.