పేదలంటే చిన్నచూపు ఎందుకు?: వైఎస్‌ షర్మిల

YS Sharmila Visits Covid Affected Families Sircilla - Sakshi

సీఎం కేసీఆర్‌కు వై.ఎస్‌. షర్మిల సూటిప్రశ్న

కరోనా మృతులకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైరస్‌ బాధితులకు పరామర్శ

సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేదలంటే చిన్నచూపు ఎందుకని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేరిస్తే పేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా దక్కేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో శుక్రవారం కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం దక్కాలని దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఉచితంగా వైద్యం పొందడం పేదల హక్కు అని, ప్రపంచంలో ఎవరూ చేయని ఆలోచన వైఎస్సార్‌ చేసి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని షర్మిల గుర్తుచేశారు.

కరోనాతో వేలాది మంది మరణించారని, కరోనా వైద్యం ఖర్చులు భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా వస్తే యశోదలో చేరారని, అదే పేదలకు వస్తే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలా? ఇదెక్కడి న్యాయమని అడిగారు. ప్రభుత్వ ఆస్పత్రులపై సీఎం కేసీఆర్‌కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిని కించపరిచేలా మాట్లాడుతున్నారని, తెలుగు ప్రజలకు వైఎస్సార్‌ అంటే ఏమిటో తెలుసన్నారు. ఆయన్ను ఏమైనా అంటే ఖబర్దార్‌.. ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు.

అంతకుముందు సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి పూలమాల వేసిన ఆమె అల్మాస్‌పూర్‌లో కరోనా బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆమె వెంట పార్టీ నాయకులు కొండ రాఘవరెడ్డి, పి.రాంరెడ్డి, ఇంద్రాశోభన్, రాజగోపాల్, రాంరెడ్డి, అమృతసాగర్, సంధ్యారెడ్డి, శైలజారెడ్డి, మహేశ్‌యాదవ్, చొక్కాల రాము తదితరులు ఉన్నారు.

చదవండి: సకల జనుల తెలంగాణే లక్ష్యం: వైఎస్‌ షర్మిల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top