
పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై కోపంతో తప్పుడు ఈ–మెయిల్స్
హైదరాబాద్: ప్రియుడిపై కోపంతో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన యువతిని శనివారం ఆర్‌జీఐఏ పోలీసులు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. చెన్నైకు చెందిన రోబోటిక్ సాఫ్ట్‌వేర్ ఇంజరీన్ రినే జోషిదా (30) చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించింది. పెళ్లికి ప్రియుడు అంగీకరించకపోవడంతో అతడిపై పగబట్టిన జోషిదా అతడిని ఏదైనా నేరంలో ఇరికించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గత ఏడు నెలలుగా దేశవ్యాప్తంగా సుమారు 11 విమానాశ్రయాలతో పాటు పలు విద్యాసంస్థలకు బాంబులున్నాయంటూ ప్రియుడికి సంబంధించిన మెయిల్‌తో సందేశాలు పంపింది.
స్విట్జర్లాండ్ వేదికగా వచ్చిన వీటిపై విమానాశ్రయం అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన సైతం తామే చేసినట్లు పంపిన ఈమెయిల్‌ను కేంద్ర దర్యాప్తు అధికారులు తీవ్రంగా పరిగణించి రినే జోషిదాను అరెస్ట్ చేశారు. ఈమెపై ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీస్ స్టేషన్‌లో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ కేసులు ఉండడంతో శనివారం ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు సీఐ బాలరాజు ఆధ్వర్యంలో కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ చేశారు.