కలిసి పనిచేయండి.. దేశసేవకు అంకితమవ్వండి

Woman IPS Probationers Leads Dikshant Parade At SVPNPA Hyderabad - Sakshi

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లకు అజిత్‌ ధోవల్‌ ఉద్బోధ 

ఎన్‌పీఏలో జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు అతిథిగా హాజరు 

27 మంది మహిళలతో సహా మొత్తం 132 మంది ప్రొబేషనరీలు 

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారులంతా కలిసి ఓ కుటుంబంలా పనిచేస్తూ దేశసేవకు అంకితం కావాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం జరిగిన ఐపీఎస్‌ ప్రొబేషనరీల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారు మాత్రమే కాదని, దేశ సౌభాగ్యం కోసం శాంతి భద్రతల్ని పరిరక్షించడం కూడా వారి విధుల్లో భాగమేనని ఉద్బోధించారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులను గుర్తు చేసుకున్న ఆయన.. వారి త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఎప్పటికప్పుడు తమ సాంకేతిక ప్రతిభను మెరుగు పరుచుకోవాలని ధోవల్‌ సూచించారు. సమకాలీన అవసరాలను బట్టి పోలీసు విధుల్లో పాదర్శకతను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఐపీఎస్‌లకు, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులర్పించారు.

ఎన్‌పీఏ డైరెక్టర్‌ అతుల్‌ కర్వాల్‌ మాట్లాడుతూ ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు శిక్షణలో భాగంగా విధి నిర్వహణతో పాటు నైతిక విలువలతో అనేకాంశాలు బోధించామని వివరించారు. ఈ ఫేజ్‌–1 శిక్షణలో ప్రొబేషనరీ అధికారిణి దర్పన్‌ అహ్లువాలియా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ధోవల్‌ చేతుల మీదుగా అహ్లువాలియాకు ఉత్తమ ప్రొబేషనరీ అవార్డుతో పాటు ఆయా అంశాల్లో ప్రతిభ కనబరిచిన కేడెట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు.

ఎన్‌పీఏలో శిక్షణ పొందిన ఈ 73వ బ్యాచ్‌లో మొత్తం 132 మంది ప్రొబేషనరీలున్నారు. వీరిలో 27 మంది మహిళలు కాగా.. ఆరుగురు భూటాన్, మరో ఆరుగురు మాల్దీవులు, ఐదుగురు నేపాల్‌ వంటి మిత్రదేశాలకు చెందిన వారూ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top