ఖమ్మం ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి వివాహిత మృతి

Woman Died After Treatment Failed At Khammam Govt Hospital - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించిన బంధువులు, అంతటితో ఆగకుండా మృతురాలిని ఉంచిన ఐసీయూ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఖమ్మం అర్బన్‌ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి, ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మి25)కి ముక్కులో గడ్డ ఏర్పడటంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ చేయాలని సూచించారు. దీంతో ఈనెల 6వ తేదీన ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్‌ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది.

అయితే, అంత వరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీరి స్వగ్రామమైన పుట్టకోటతో పాటు మృతురాలి స్వగ్రామమైన తిరుమలాయపాలెం నుండి పెద్దసంఖ్యలో బంధువులు చేరుకోగా, న్యూడెమెక్రసీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. 

ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన
మృతురాలి బంధువులు, వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుడు సరిగా పట్టించుకోలేదని, మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం కావటంతో వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది భారీగా మొహరించారు. అంతే కాకుండా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు చేరుకుని మృతురాలి బంధువులకు నచ్చచెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నారు.

చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంఓ బి.శ్రీనివాసరావు, ఏసీపీ ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు వెంకటలక్ష్మి బంధువులతో చర్చించి కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వడమే కాక ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాత్రి ఆందోళన విరమించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top