
పనిచేస్తున్నందుకు వెళ్తే ప్రాణమే పోయింది
హత్యకు గురైన గణేశ్ కుటుంబానికి దిక్కెవరు?
భార్యాభర్తల పంచాయిలో ఇద్దరి మృతి
మృతుల్లో గణేశ్ ఒకరు.. రోడ్డున పడిన కుటుంబం
పెద్దపల్లిరూరల్: ‘అయ్యోపాపం.. అన్నెంపున్నెం ఎరగని గాండ్ల గణేశ్(37) ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’ అని రాఘవాపూర్ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్క్రాప్ వ్యాపారం చేసే పస్తం జంపయ్య వద్ద గాండ్ల గణే శ్ పదేళ్లకుపైగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జంపయ్య కుటుంబంలోనూ ఆ యన ఒకడిగా ఉంటున్నాడు. మంగళవారం జంపయ్య సోదరి లక్ష్మి, బావ మారయ్య పంచాయితీకి ఇతను కూడా సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. గతంలో మాదిరిగానే ఇదికూడా సా ధారణ పంచాయితీగానే ఉంటుందని భావించా డు. అనూహ్యంగా జరిగిన కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
జీతమే ఆధారం..
నిరుపేద కుటుంబీకుడైన గాండ్ల గణేశ్ రాఘవాపూర్ గ్రామంలో అందరితో మర్యాదగా ఉంటాడు. యజమాని ఇచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. భార్య రజిత, కూతురు రిత్విక(4) ఉన్నారు. స్క్రాప్ వ్యాపారం సాగించే పస్తం జంపయ్య వద్ద సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు.
మాకు దిక్కెవరు?
‘అయ్యో.. వివాదంతో ఏసంబంధం లేనితన భర్త ను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. ఇక మాకు దిక్కెవర’ని మృతుడు గణేశ్ భార్య రజిత రోదించిన తీరు కలచివేసింది. నాలుగేళ్ల పాపతో ‘నువు లేకుండా ఎలా బతికేద’ని విలపిస్తున్న తీరు స్థానికులను చలింపజేసింది.
పరిహారం చెల్లింపు!
జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గాండ్ల గణేశ్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోయిందని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గ్రామపెద్దలు, బంధువులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య జరిపిన చర్చల్లో అంత్యక్రియల కోసం రూ.లక్షతో పాటు కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
పెగడపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సుగ్లాంపల్లిలో జరిగి న భార్యాభర్తల పంచాయితీ ఘర్షణలో మోటం మల్లేశం మృతి చెందడంతో పెగడపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. మల్లేశం బతుకుదెరువు కోసం సుమారు 15 ఏళ్ల క్రితం పెగడపల్లి గ్రామానికి వలస వచ్చాడు. బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ముత్తారం మండలాల్లో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం చేపట్టిన సొంతింటి నిర్మాణం చివరి దశలో ఉంది. గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ సర్పంచ్ సుజాత, కాంగ్రెస్ నాయకులు మియాపురం సతీశ్ తదితరులు సంతాపం ప్రకటించారు.