
కార్యకలాపాలకు సాఫ్ట్‌వేర్‌లను ప్రవేశపెట్టని వ్యవసాయ మార్కెట్లు
రైతుల సరుకుల వివరాలు 70 ఏళ్లుగా చీటీలపైనే రాస్తున్న వ్యాపారులు
నిరక్షరాస్యులైన రైతులను మోసగిస్తున్న వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: రూ.80 వేల కోట్ల టర్నోవర్.. రూ.800 కోట్ల వార్షిక ఆదాయం.. కానీ, ఆధునికతకు ఆమడదూరం.. పాత పద్ధతినే అంటిపెట్టుకున్న వైనం.. చిట్టీలపైనే రైతుల సరుకుల వివరాలు.. వివరాలన్నీ లోపభూయిష్టం.. ఇదీ హైదరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ల పరిస్థితి. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా పేరొందుతున్న హైదరాబాద్‌లో ఇంకా మూస పద్ధతిలోనే చిట్టీలపై రాతలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు.
మార్కెట్ యార్డుల్లో తెలుగు రైతులతో హిందీలో మాట్లాడటం, కన్నడ, హిందీ భాష మాట్లాడే వారికి తెలుగులో సమాధానం చెప్పడం నిత్యకృత్యం. కమిషన్ ఏజెంట్ చెప్పింది రాసుకోవడమే సిబ్బంది పనా? ఇచ్చింది తీసుకెళ్లడం రైతు వంతా? ఈ తంతులో రైతుకు న్యాయం జరుగుతోందా? కమిషన్ ఏజెంట్లు, మధ్యవర్తి కలసి రైతును నిండా ముంచుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం కరవనే చెప్పాలి. రైతు, మార్కెట్ కమిటీలు రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధికారులు డిమాండ్ లేని చోట్ల రూ.వందల కోట్లు పెట్టి మార్కెట్లను అభివృద్ధి చేశారు. డిమాండ్ ఉన్న హైదరాబాద్ (Hyderabad) లాంటి చోట్ల పట్టించుకోవడం లేదు.
అలా మొదలైంది..
వ్యవసాయ మార్కెట్ యార్డులను 1960లో భువనగిరి, వరంగల్‌లో ప్రారంభించారు. సత్ఫలితాలివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 197కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గడ్డిఅన్నారం, గుడి మల్కాపూర్, బోయిన్‌పల్లి, మలక్‌పేట్ మార్కెట్లను (Malakpet Market) అందుబాటులోకి తెచ్చారు. నగర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, పూలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, తదితర నిత్యవసరాలు ఆయా మార్కెట్ల నుంచి సరఫరా చేస్తున్నారు.
తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పండ్లు, పూలు, ఇతర వస్తువులు దిగుమతి చేసుకుని క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. అయితే మార్కెట్లకు వచ్చే వాహనాలపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో రైతులు, మార్కెట్ కమిటీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రైతు తెచ్చిన సరుకులకు తక్‌పట్టీ ఇవ్వాలి. కానీ, చాలామంది వ్యాపారులు తెల్లచీటీ రాసి ఇస్తున్నారు.
తెచి్చన బస్తాలు, కూరగాయల బరువు, ఎంత ధర పలికిందనే వివరాలు దీనిపై ఉండాలి. అయితే ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతు తెచ్చిన బస్తాలు, బరువు, ఎంతకు కొన్నారు, ఎంత మొత్తం కమిషన్ రూపంలో మార్కెట్ కమిటీకి చెల్లిస్తున్నారనే సమాచారం లోపభూయిష్టంగా నడుస్తోంది.
రూ.80 వేల కోట్ల టర్నోవర్
తెలంగాణలో 197 మార్కెట్ కమిటీల్లో ఏటా సుమారు రూ.80 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందని అంచనా. ఒక్క శాతం కమిషన్ చొప్పన మార్కెట్ కమిటీలకు ఏటా సుమారు రూ.800 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే మార్కెట్ కమిటీల్లో సాంకేతికతను ప్రవేశపెడితే మరింత ఆదాయం పెరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి ముగ్గురు మంత్రులు
వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని వచ్చే రైతులు ప్రవేశ గేటు వద్దే ఎన్ని బస్తాలు ఉన్నాయి.. ఇంకా ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం కమిషన్ ఏజెంట్ ఆ సరుకును ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలు చెప్పగానే ఎంత క్వాంటిటీ తెచ్చారు.. రైతుకు చెల్లించాల్సిన సొమ్ము.. మార్కెట్ కమిటీకు రావాల్సిన కమిషన్‌ను వెల్లడించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తేవాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.