breaking news
gaddi annaram market
-
రూ.80 వేల కోట్ల టర్నోవర్.. ఆధునికతకు ఆమడదూరం!
సాక్షి, హైదరాబాద్: రూ.80 వేల కోట్ల టర్నోవర్.. రూ.800 కోట్ల వార్షిక ఆదాయం.. కానీ, ఆధునికతకు ఆమడదూరం.. పాత పద్ధతినే అంటిపెట్టుకున్న వైనం.. చిట్టీలపైనే రైతుల సరుకుల వివరాలు.. వివరాలన్నీ లోపభూయిష్టం.. ఇదీ హైదరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ల పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా పేరొందుతున్న హైదరాబాద్‌లో ఇంకా మూస పద్ధతిలోనే చిట్టీలపై రాతలు కొనసాగుతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో తెలుగు రైతులతో హిందీలో మాట్లాడటం, కన్నడ, హిందీ భాష మాట్లాడే వారికి తెలుగులో సమాధానం చెప్పడం నిత్యకృత్యం. కమిషన్ ఏజెంట్ చెప్పింది రాసుకోవడమే సిబ్బంది పనా? ఇచ్చింది తీసుకెళ్లడం రైతు వంతా? ఈ తంతులో రైతుకు న్యాయం జరుగుతోందా? కమిషన్ ఏజెంట్లు, మధ్యవర్తి కలసి రైతును నిండా ముంచుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం కరవనే చెప్పాలి. రైతు, మార్కెట్ కమిటీలు రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధికారులు డిమాండ్ లేని చోట్ల రూ.వందల కోట్లు పెట్టి మార్కెట్లను అభివృద్ధి చేశారు. డిమాండ్ ఉన్న హైదరాబాద్ (Hyderabad) లాంటి చోట్ల పట్టించుకోవడం లేదు.అలా మొదలైంది.. వ్యవసాయ మార్కెట్ యార్డులను 1960లో భువనగిరి, వరంగల్‌లో ప్రారంభించారు. సత్ఫలితాలివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 197కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గడ్డిఅన్నారం, గుడి మల్కాపూర్, బోయిన్పల్లి, మలక్‌పేట్ మార్కెట్లను (Malakpet Market) అందుబాటులోకి తెచ్చారు. నగర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, పూలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, తదితర నిత్యవసరాలు ఆయా మార్కెట్ల నుంచి సరఫరా చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పండ్లు, పూలు, ఇతర వస్తువులు దిగుమతి చేసుకుని క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. అయితే మార్కెట్లకు వచ్చే వాహనాలపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో రైతులు, మార్కెట్ కమిటీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రైతు తెచ్చిన సరుకులకు తక్‌పట్టీ ఇవ్వాలి. కానీ, చాలామంది వ్యాపారులు తెల్లచీటీ రాసి ఇస్తున్నారు.తెచి్చన బస్తాలు, కూరగాయల బరువు, ఎంత ధర పలికిందనే వివరాలు దీనిపై ఉండాలి. అయితే ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతు తెచ్చిన బస్తాలు, బరువు, ఎంతకు కొన్నారు, ఎంత మొత్తం కమిషన్ రూపంలో మార్కెట్ కమిటీకి చెల్లిస్తున్నారనే సమాచారం లోపభూయిష్టంగా నడుస్తోంది. రూ.80 వేల కోట్ల టర్నోవర్ తెలంగాణలో 197 మార్కెట్ కమిటీల్లో ఏటా సుమారు రూ.80 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోందని అంచనా. ఒక్క శాతం కమిషన్ చొప్పన మార్కెట్ కమిటీలకు ఏటా సుమారు రూ.800 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే మార్కెట్ కమిటీల్లో సాంకేతికతను ప్రవేశపెడితే మరింత ఆదాయం పెరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి ముగ్గురు మంత్రులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని వచ్చే రైతులు ప్రవేశ గేటు వద్దే ఎన్ని బస్తాలు ఉన్నాయి.. ఇంకా ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం కమిషన్ ఏజెంట్ ఆ సరుకును ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలు చెప్పగానే ఎంత క్వాంటిటీ తెచ్చారు.. రైతుకు చెల్లించాల్సిన సొమ్ము.. మార్కెట్ కమిటీకు రావాల్సిన కమిషన్‌ను వెల్లడించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తేవాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. -
బెట్టు వీడని ఏజెంట్లు.. మెట్టు దిగని సర్కారు
సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మార్కెట్ తరలింపుపై సర్కారు మెట్టు దిగకపోవడం.. తరలించే అంశంపై కమీషన్ ఏజెంట్లు బెట్టు వీడకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు మార్కెట్‌కు తాళం పడడంతో పండ్ల క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. గత నెల 25న మార్కెట్ బంద్ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో పండ్ల ధరలు పెరిగిపోయాయి. కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బాటసింగారంలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి అక్కడ మార్కెట్ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉన్నపళంగా మార్కెట్‌ను మార్చడాన్ని తప్పుబడుతూ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. కమీషన్ ఏజెంట్ల వాదనను ఆలకించిన న్యాయస్థానం.. సౌకర్యాల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక మేరకు ఈ నెల 18వ తేదీ వరకు మార్కెట్‌ను గడ్డిఅన్నారంలోనే కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్‌ను ప్రారంభిస్తారని కమీషన్ ఏజెంట్లు ఆశించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం మెట్టు దిగకపోగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తాముకూడా కేవియట్ దాఖలు చేసినట్లు కమీషన్ ఏజెంట్ల ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దసరా తరువాతే విచారణ గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపుపై దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. మార్కెట్ తరలింపును అక్టోబర్ 18 వరకూ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం విచారించాలని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. అయితే అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం, దసరా సెలవుల అనంతరం విచారిస్తామని పేర్కొంది. (చదవండి.. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు: సీఎం కేసీఆర్) -
దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్: నాడు అలా, నేడు ఇలా!
సాక్షి, చైతన్యపురి: దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి చెంది.. 35 ఏళ్లపాటు వేలాది మంది రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలకు బాసటగా నిలిచి..నగరవాసులకు ఒక గుర్తుగా మిగిలిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కథ ముగిసింది.1986లో ఏర్పడిన ఈ మార్కెట్‌కు మూడు రోజుల క్రితం తాళం పడింది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్కెట్‌ను బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కుకు తరలించారు. దీంతో నిత్యం వందలాది లారీలు... లావాదేవీలు..చిరు వ్యాపారులతో సందడిగా ఉండే మార్కెట్ మూగబోయింది. మామిడి సీజన్లో ఇక్కడ భారీ లావాదేవీలు జరుగుతుంటాయి. కొత్తపేట పండ్ల మార్కెట్ బుధవారం ఇలా బోసిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సరుకు వస్తుంటుంది. ఇక ఇవన్నీ ఆగిపోయినట్లే. మరోవైపు మార్కెట్ తరలింపును ఇష్టపడని వ్యాపారులు, రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఏళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న కూలీలు, హమాలీలు సైతం నిరాశకు గురయ్యారు. బాటసింగారంలో..కోహెడలో సరైన వసతులు కల్పించకుండా తమను అక్కడికి వెళ్లాలని ఆదేశించడం ఏమాత్రం సబబుగా లేదని వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
మామిడి కొనుగోళ్ల నిలిపివేత
-
మామిడి కొనుగోళ్ల నిలిపివేత: హరీష్ ఆగ్రహం
హైదరాబాద్ : కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మామిడి కొనుగోళ్ల నిలిపివేతపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్ల నిలిపివేత సరికాదు.. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని వ్యాపారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించక పోతే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఆదేశం మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు. కార్బైడ్, చైనా పౌడర్‌ను ఉపయోగించి మామిడికాయలను మార్కెట్‌కి తీసుకు వస్తున్నారని వ్యాపారస్తులు కొనుగోళ్లు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్ వాడుతున్నారంటూ 92 దుకాణాలకు లైసెన్స్‌లు రద్దు చేస్తూ మార్కెటింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. మరో వైపు సోమవారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. -
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపు
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శివారులోని కోహెడ సమీపంలోకి మార్చనున్నట్లు మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం శాసనసభలో తెలిపారు. గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు ప్రస్తుతం 22 ఎకరాల్లో ఉందని, స్థలం చాలక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ను కోహెడకు తరలించి 178 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మార్కెట్ ఔటర్ రింగ్‌రోడ్ పక్కనే ఉండటం వల్ల రైతులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందన్నారు. మార్కెట్ యార్డు తరలింపు వల్ల నగరంలో కొన్ని ట్రాఫిక్ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందన్నారు.