గీసుకొండ/నెక్కొండ: కేరళలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన సింగారపు కుమారస్వామి, మంజుల దంపతుల కూతురు శ్వేత (25)కు రెండేళ్ల క్రితం సంగెం మండలం కుంటపల్లికి చెందినసీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జంగం విక్రంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా విక్రం కేరళలో విధులు నిర్వర్తిస్తుండగా బీటెక్ చదివిన శ్వేత అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.
వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈనెల 21న శ్వేత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాకలోని విక్రం ఇంటికి తీసుకొచ్చారు. తన కూతురు మృతికి అల్లుడే కారణం అంటూ మృతురాలి బంధువులు, సూరిపల్లి గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు.
కొట్టడంతోపాటు ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో అక్కడే నిరసన తెలిపారు. విక్రంకు సంబంధించిన జాన్‌పాక, కుంటపల్లిలోని ఆస్తిని మృతురాలి బంధువులకు రాసి ఇవ్వాలంటూ పట్టుబట్టి అంగీకార పత్రం రాయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కు మార్, సిబ్బంది వెళ్లి గొడవ చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి రాత్రి బంధువులు శ్వేత మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సూరిపల్లికి తీసుకెళ్లారు.


