పల్లె కుసుమం.. బెంగుళూరు డీఆర్‌డీఏలో శాస్త్రవేత్తగా కొలువు

Warangal Village Woman Rajyalakshmi Got Job In Bengaluru DRDA scientist - Sakshi

సాక్షి, వరంగల్‌: కృషి,  పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని ఓ యువతి నిరూపించింది.  నిరుపేద చేనేత కార్మికుడి కూతురు బెంగుళూరు డీఆర్‌డీఏలో శాస్త్రవేత్తగా కొలువు సంపాదించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ యువతి తండ్రి సంరక్షణలో పెరిగి ఇంతటి ఘన కీర్తిని సొంతం చేసుకున్న ఆ పల్లె కుసుమం.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వనం ఉమాదేవి-సదా నందం దంపతుల కూతురే ఈ రాజ్యలక్ష్మి. సదా నందం దంపతులకు ఇద్దరు సంతానంలో రాజ్యలక్ష్మి పెద్దది.. తల్లి ఉమాదేవి 2004లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి సదానందం పిల్లలకు అన్నీతానై అల్లారు ముద్దుగా పెంచాడు. చేనేత కార్మికుడిగా వచ్చేది చాలీచాలని సంపాదనే అయినా పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు. ఇల్లందలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి దాకా చదివిన రాజ్య లక్ష్మి, ఇంటర్ పూర్తయ్యాక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు (బీటెక్ - కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) సంపాదించి ఉన్నత విద్యపూర్తి చేసింది

 ఆమె ప్రతిభను గుర్తించిన అక్కడి అధ్యాపకులు అక్కడే ఆమెకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసే అవకాశం కల్పించారు. అక్కడ పనిచేస్తూ అహర్నిశలు కష్టపడింది. ఈ క్రమంలో ఆమె వివాహం ప్రశాంత్‌తో అయ్యింది. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో పరీక్షలు రాసి బెంగుళూరులోని డీఆర్‌డీఏలో కేటగిరీ-బీలో సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించినట్లు రాజ్యలక్ష్మి తెలిపింది. 

ఎన్నో కష్టాలను అధిగమించి అహర్నిశలు శ్రమిస్తే గాని ఈ ఉద్యోగం తనని భరించలేదని రాజ్యలక్ష్మి చెబుతోంది. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చదివి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాలని చెబుతోంది. తన విద్యాభ్యాసంలో తోడ్పాటు అందించిన అధ్యాపకులను గుర్తుచేసుకొని తన కృతజ్ఞతలు తెలిపింది. గ్రామీణ ప్రాంతం నుండి ఓ యువతి బెంగళూరు డిఆర్డిఏ లో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల తన తండ్రి సదానందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు సాధించిన ఘనత మా కష్టాలను దూరం చేసిందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులో రాణించి యువ శాస్త్రవేత్తగా ఎంపికైన రాజ్యలక్ష్మి ప్రయాణం నేటి యువతకు ఆదర్శమని చెప్పాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top