ఎంజీఎం ఎలుకల దాడి ఘటన: బాధితుడు శ్రీనివాస్‌ కన్నుమూత

Warangal MGM Rat Victim Srinivas Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో బాధితుడు శ్రీనివాస్‌ మృతి చెందాడు.  ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో  చికిత్స పొందుతూ.. ఇవాళ  వేకువ జామున కన్నుమూశాడు. 

శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్‌ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతినడంతో రక్తస్రావం జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, చాలామంది ఎలుకల దాడికి గురయ్యారని పేషెంట్లు వాపోయారు.

విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు దిగింది. శ్రీనివాస్‌పై ఎలుకల దాడిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండె వైఫల్యంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్‌.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీనివాస్‌ మృతదేహాన్ని నిమ్స్‌ నుంచి కుటుంబ సభ్యులు హన్మకొండకు తీసుకెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top