కనువిందుగా గోడలు.. కళాత్మకంగా కూడళ్లు..

Wall painting In HYD: Impressive Sculptures At Intersections - Sakshi

కనువిందుగా గోడలు.. కళాత్మకంగా కూడళ్లు..

ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో రంగుల వీధులు

సాక్షి, బంజారాహిల్స్‌: రంగురంగుల శిల్పాలు.. ఆలోచనాత్మక పెయింటింగ్స్‌తో వీధులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బాటసారులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే శిల్పాలను ఏర్పాటు చేస్తూ నగరానికి మరింత వన్నె చేకూరుస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌ పరిధి కిందకు వచ్చే పలు ప్రాంతాల్లో జేఎన్‌టీయూకి చెందిన నలుగురు విద్యార్థులు ఈ కళాత్మక ఆకృతులను తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతాలకు కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నారు. జేఎన్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి చెందిన సంతోష్‌ బుద్ది, అబ్దుల్‌ రహ్మాన్, మహేష్‌కుమార్‌ గంగనపల్లి, మురళీకృష్ణ కంపెల్లిలు గత కొద్ది రోజులుగా పలు ప్రహరీలకు కొత్త నగషిలు చెక్కుతున్నారు. 

కేవలం రంగులు పూసి చేతులు దులుపుకోకుండా ఆ ఆకృతులకు ఆలోచనల రూపురేఖలు తీసుకొస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సౌజన్యంతో ఈ నలుగురు యువకులు ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రహరీలకు కొత్త రూపును సంతరించుకునేలా పెయింటింగ్స్‌ వేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తమకు సంపూర్ణ సహకారం అందిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ పెయింటింగ్స్, శిల్పాలు తమకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. ముందుగా తాము పెయింటింగ్‌ వేసే ప్రాంతాన్ని లేదా శిల్పాలు తీర్చిదిద్దే చౌరస్తాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉంటే బాగుంటుందో డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. విద్య, పచ్చదనం, పూలు ఇలా వివిధ రకాల ఆలోచనలతో ఈ ఆర్ట్‌ వర్క్స్‌ ఉంటాయని వారు తెలిపారు.  

ఆకట్టుకునే శిల్పాలివే.. 
► ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.70 అశ్విని లేఅవుట్‌ చౌరస్తాలో రాష్ట్ర పక్షి పాలపిట్ట శిల్పాన్ని ఏర్పాటు చేశారు.  
►బంజారాహిల్స్‌రోడ్‌ నెంబర్‌.1/5 జీవీకే వన్‌ చౌరస్తాలో గులకరాళ్ల శిల్పాన్ని తీర్చిదిద్దారు.  
► బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.45 జంక్షన్‌లో వాల్‌ ఆర్ట్‌ను వేశారు. 
 ►లక్డీకాపూల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కూడా ఈ వాల్‌ ఆర్ట్‌ కనువిందు చేస్తున్నాయి.  
►బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.1/12 పెన్షన్‌ కార్యాలయం చౌరస్తాలో బస్టాప్‌ను వాల్‌ ఆర్ట్‌తో సుందరంగా తీర్చిదిద్దారు.  
► ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ పైన చిన్నారులకు విద్య తప్పనిసరి అనే కాన్సెప్ట్‌తో వాల్‌ ఆర్ట్‌ ఆకట్టుకుంటున్నది.  
► ఫిలింనగర్‌ సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తాలో వాల్‌ ఆర్ట్‌ పాదచారులు, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. 
►ఇలా ప్రధానమైన చౌరస్తాలో ఈ నలుగురు విద్యార్థులు తమలోని ప్రతిభతో నగరంలోని పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతూ  చూపరులను కట్టిపడేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top