వీఆర్‌ఏల ‘చలో సీసీఎల్‌ఏ’ భగ్నం 

Vra Chalo Ccla Stopped by Police Hyderabad - Sakshi

అడ్డుకున్న పోలీసులు.. పలువురికి గాయాలు 

సీసీఎల్‌ఏ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన వీఆర్‌ఏలు

సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు తలపెట్టిన ‘చలో సీసీఎల్‌ఏ’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వివిధ మార్గాల్లో అబిడ్స్‌ వరకు చేరుకున్న వీఆర్‌ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం శాంతియుత ఆందోళన నిర్వహించేందుకోసం సీసీఎల్‌ఏకు ర్యాలీగా బయలుదేరిన వీఆర్‌ఏలను హైదరాబాద్‌ కలెక్టరేట్‌ సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వారు సీసీఎల్‌ఏ వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వీఆర్‌ఏలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు వీఆర్‌ఏలకు గాయాలయ్యాయి.

వికారాబాద్‌కు చెందిన మహిళా వీఆర్‌ఏ సరోజకు చెయ్యి విరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు కొందరు సీసీఎల్‌ఏ కార్యాలయానికి చేరుకుని సీసీఎల్‌ఏ కార్యదర్శి హైమావతికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వీఆర్‌ఏల జేఏసీ చైర్మన్‌ జి. రాజయ్య, సెక్రెటరీ జనరల్‌ ఎస్‌.కె.దాదేమియాలు మాట్లాడుతూ.. గత 20 నెలలుగా సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్న తమకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు విని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా ఆందోళనలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న వీఆర్‌ఏలను నిర్బంధించడం, ఆందోళనలో పాల్గొంటున్న వారిపై దాడి చేయడం తగదని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్‌లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల పట్ల పోలీసుల చర్యలను వీఆర్‌వోల సంఘం నేతలు వింజమూరి ఈశ్వర్, గోల్కొండ సతీశ్‌లు కూడా వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top