3 అడుగుల మట్టి విగ్రహాలకే పరిమితం

Vinayaka Chavithi Celebrations In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం ‌: కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలు శని వారం సాదాసీదాగానే చవితి వేడుకలు నిర్వహించారు.    భక్తులు మాత్రం తమ శక్తిమేరా చిన్నచిన్న మట్టి, విత్తన విగ్రహాలను ఇంట్లో ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజలు చేశారు. అధికారుల ఆదేశాలతో 3 అడుగుల లోపు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. బస్టాండ్‌ సెంటర్, బొమ్మనబజార్, శ్రీనివాసథియేటర్, వినోద థియేటర్, బ్రాహ్మణబజార్‌ శివాలయం సెంటర్, మామిళ్లగూడెం, బస్‌డిపోరోడ్డు, గాంధీచౌక్‌ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడంతో సందడి కనిపించడంలేదు. ఏకో ఫ్రెండ్లీ గణేష్‌ ప్రాచుర్యం కావడంతో భక్తులంతా మట్టి, విత్తన విగ్రహాలను పూజించేందుకు ఆసక్తి చూపించారు. ప్రధాన ఆలయాల్లో మాత్రం బొజ్జ గణపయ్యకు నిరాడంబరంగా పూజలు చేశారు. 

మట్టి గణపతులను పూజిద్దాం 
ఖమ్మంమయూరిసెంటర్‌: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం మట్టి గణపతులనే పూజిద్దామని కార్పొరేటర్, కాంగ్రెస్‌ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్‌ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్‌ తిలక్‌ పిలుపునిచ్చారు. గాంధీచౌక్‌ ట్రంక్‌రోడ్‌లోని సాయి విశ్వనాథ అపార్ట్‌మెంట్‌లో మటి విగ్రహానికి శనివారం పూజలు నిర్వహించారు. కృష్ణారావు, వెంకటరమణ, నాగరాజు, రమేష్‌  పాల్గొన్నారు. 

ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెంలో..
ఖమ్మంఅర్బన్‌: నగరంలోని పలు కాలనీలు, రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాలకు  శనివారం పూజలు చేశారు. మధురానగర్‌లోని సాయి మందిరంలో జిల్లా కేంద్రసహకార బ్యాంక్‌ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం దంపతులు వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఇందిరానగర్‌లోని బాలగణపతి దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు బా జిన్ని వీరయ్య, తిరుపతిరావు దంపతులు పూజలు చేశారు. దిశ కమిటీ సభ్యుడు మెంటం రామారావు ఆధ్వర్యంలో చింతగుర్తిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  

కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.. 
ఖమ్మంమయూరిసెంటర్‌: త్రీటౌన్‌ ప్రాంతంలో కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించి శనివారం పూజలు చేశారు.  మహంకాళి మల్లికార్జున్, జి.వెంకట్‌రెడ్డి, భానోత్‌ రాందాస్, భాస్కర్, కేసగాని రవి తదితరులు పాల్గొన్నారు. 


                          కాణిపాక వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top