మన కళలను మనమే కాపాడుకోవాలి

Vice President Venkaiah Naidu At The Culture Festival In Telangana - Sakshi

శిల్పులు, చేతివృత్తి కళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలి 

రుణ సౌకర్యం, మార్కెటింగ్‌ వసతులు కల్పించాలి.. సంస్కృతి మహోత్సవ్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌:  కార్పొరేట్‌ రంగం నుంచి సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరూ మన శిల్పులు, చేతివృత్తి కళాకారుల ఉత్పత్తులను కొనడం ద్వారా వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఇలా చేయడం ద్వారా మన కళలు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుందన్నారు.

శుక్రవారం ఎన్టీఆర్‌ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌ను ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. భారతీయ శిల్పులు, చేతివృత్తి కళాకారులకు అవసరమైన మేర రుణాలు అందించడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ వసతులు కల్పించడం అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారికాళ్ల మీద వారు నిలబడే పరిస్థితిని కల్పించినప్పుడే వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే వీలుంటుందన్నారు.  

కళలను పాఠ్యాంశాల్లో చేర్చాలి 
వివిధ రకాల భారతీయ కళలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. విద్యతో పాటు కళల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను గిరిజన సంప్రదాయాలు, నృత్యాలకు అంకితం చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 550 మంది స్థానిక కళాకారులతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడారు. 580 మంది జానపద కళాకారులు, 150 మందికి పైగా చేతివృత్తి కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన దాదాపు 150 మంది నృత్య కళాకారులు తమ కళలను ప్రదర్శించారు.  

భిన్నసంస్కృతులపై అవగాహన అవసరం
భిన్న ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో చేతి వృత్తులు–వంటకాల ప్రదర్శనను శుక్రవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. కాగా పలు ఉత్పత్తుల స్టాల్స్, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కిషన్‌రెడ్డి సన్మానించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top