
అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. సమీక్షలో మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
రాజస్తాన్‌లో జరిగే సదస్సు కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులనుఆదేశించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నీటిపారుదల శాఖపై శనివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. రాజస్తాన్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సుకు రాష్ట్ర సాగునీటి రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్ వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సు కేంద్ర ప్రభుత్వ విధానకర్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానుందన్నారు. నీటి నిర్వహణ, నిల్వల పెంపుదల, సాగునీటి సామర్థ్యం పెంపు వంటి అంశాలు ఈ సదస్సులో చర్చకు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవలంబిస్తున్న సూక్ష్మ సేద్యం, జలాశయాల్లో పూడికతీత, తక్కువ వ్యయంతో అధిక ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అమలు చేస్తున్న ప్రణాళిక, నదుల పరిరక్షణ వంటి విధానాలను జాతీయ వేదికపైకి తెలియజేయాల్సిన అవసరముందని చెప్పారు.
సదస్సులో రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడానికి గణాంకాలు, కేస్ స్టడీస్‌తో ద్యశ్యరూపాలను సిద్ధం చేయాలన్నారు. ఈ జాతీయ సదస్సులో తెలంగాణ నీటి పారుదల వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు గొప్ప వేదిక కానున్నట్టు ఉత్తమ్ చెప్పారు. గత ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసినా పరిమిత ఫలితాలనే సాధించిందని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల తదితర ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు ఈ సమావేశంలో మంత్రికి నివేదిక సమర్పించారు.