విమాన ప్రదర్శనలో అబ్బురపరుస్తున్న సాంకేతికత
నేటి నుంచి సాధారణ ప్రజలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2026 విమానయాన ప్రదర్శనలో విమానాల సాంకేతికతతోపాటు డ్రోన్లలో వచ్చిన ఆధునిక మార్పులు వావ్ అనిపిస్తున్నాయి. ఇక్కడ మల్టీరోటర్ మావీయోమ్ ఎక్స్4 డ్రోన్ ద్వారా గూగుల్ ఎర్త్‌కు సంబంధించి యూఏవీ ఫొటోలను ఎలా సేకరించవచ్చో, అగ్రికల్చర్ రీసెర్చ్ ఫారెస్ట్ ట్రాకింగ్, సర్వైలెన్స్, డిటెక్షన్, పొల్యూషన్ డిటెక్షన్, మ్యాపింగ్, మైనింగ్ ప్రాంతాల గుర్తింపు, 3డీ ల్యాండ్ మోడలింగ్ ఇలా డ్రోన్లను ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలిపే వినూతన స్టాల్స్ వెలిశాయి.
ఈ ప్రదర్శనలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన తిహన్ ఇన్నోవేషన్ హబ్ అభివృద్ధి చేసిన అత్యాధునిక డ్రోన్ సాంకేతికత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రోన్ ప్రధానంగా అటానమస్ నావిగేషన్ సాంకేతికతపై పనిచేస్తుందని తిహన్ సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న షేక్ జానీ బాషా తెలిపారు. భూమిపై నడిచే వాహనాలు, గగనతలంలో ప్రయాణించే డ్రోన్లకు స్వయంచాలక మార్గనిర్దేశం చేయడమే దీని ప్రత్యేకత.
ఈ డ్రోన్‌ను ముఖ్యంగా సైనిక అవసరాల కోసం ఆయుధాలు లేదా సరుకులు రవాణా చేయడానికి రూపొందించినప్పటికీ, అవసరాన్ని బట్టి వాణిజ్య అవసరాలకూ వినియోగించవచ్చన్నారు. ఈ డ్రోన్ గరిష్టంగా 150 కిలోల బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు.
19 సీట్ల సామర్థ్యం కలిగిన హిందూస్తాన్ 228 విమానం అచ్చంగా దేశీయ తయారీ విమానం. దీనికి సంబంధించిన ప్రతి ముడి ఉత్పత్తిని భారత్‌లోనే రూపొందించారు. విమానయాన రంగంంలో సగర్వంగా భారత కీర్తిని చాటిచెప్పే ఈ విమానం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు ఉత్సుకత కనబరిచారు. దీని టేకాఫ్ వెయిట్ 6,200 కిలోలు, ఫ్యూయల్ కెపాసిటీ 2,250 కిలోలు.
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీమ్ బృందంలో సభ్యురాలిగా ఉన్న మహిళా పైలట్ కన్వల్ సంధు, మరోపైలట్ సంజయ్‌లు వైమానిక విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. విమానయాన రంగంలో మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువతులు ధైర్యంగా ముందడుగు వేయాలని కన్వల్ సంధు ‘సాక్షి’కి తెలిపారు. వింగ్స్ ఇండియా–2026లో శుక్ర, శనివారాల్లో సాధారణ ప్రజానీకానికి అనుమతి కల్పించారు. బుక్ మై షోలో గానీ, విమానాశ్రయంలో ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద గానీ రూ.వెయ్యి చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


