గడువు తేదీ చెప్పకుండాఅర్ధంతరంగా నిలిపేసిన బీసీ సంక్షేమ శాఖ
యథాతథంగా దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు
తీవ్ర ఆందోళనలో బీసీ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రీమెట్రిక్ విద్యార్థుల ఉపకార దరఖాస్తు ప్రక్రియలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్న సంక్షేమ శాఖలు... బీసీ విద్యార్థులకు మాత్రం దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం, కనీసం గడువు తేదీని సైతం ఖరారు చేయకుండా అర్ధంతరంగా దరఖాస్తు ప్రక్రియను ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి... ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. విద్యార్థులకు దరఖాస్తుపై పెద్దగా అవగాహన ఉండదనే భావనతో పాఠశాల యాజమాన్యాలు.. టీచర్లకు సూచనలిస్తూ ఆయా పిల్లల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇందులో భాగంగా ఈ–పాస్ వెబ్‌సైట్‌లో ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ ఆప్షన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ దరఖాస్తుకు ఎలాంటి గడువు విధించలేదు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా... ప్రీమెట్రిక్ విద్యార్థులకు సైతం ఆమేరకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు మౌఖికంగా చెప్పుకొచ్చారు. దీంతో సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అలా వివరాలు సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను పాఠశాల యాజమాన్యాలు, టీచర్లు వీలుచిక్కినప్పుడు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నారు. కొన్నిచోట్ల సమీప మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకునేందుకు విద్యార్థులకు సమయం పడుతుండటంతో సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమర్పించారు. అయితే, ఇంకా పత్రాలు సిద్ధం చేసుకోని వారి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది.
ఇంతలో బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తుల స్వీకరణను వారం రోజుల క్రితం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులు కొనసాగుతున్నప్పటికీ... బీసీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ నిలిపివేయడంపై బీసీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు మూడు రోజులుగా బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దరఖాస్తుకు అవకాశం కల్పించాలని వినతులు సమర్పిస్తున్నారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తామని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు చెప్పారు.


