ఎల్–3 జాబితాలో చేరుస్తున్న గృహనిర్మాణ శాఖ
ఇళ్ల మంజూరు సమయంలో ఈ అంశాన్ని పట్టించుకోని వైనం
తీరా ఇళ్లు నిర్మించుకున్నాక బిల్లుల మంజూరుకు ససేమిరా!
అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు
సాక్షి, హైదరాబాద్: ‘‘పేదల్లో నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం..’’ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించే సమయంలో ప్రభుత్వం పదేపదే చెప్పిన మాట. ‘‘ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాలి, సొంతిల్లు ఉంటే గనక కేవలం కచ్చా పైకప్పుతో కూడిన ఇల్లు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ఆర్‌సీసీ పైకప్పు ఉండకూడదు’’అని అర్హతల జాబితాలో స్పష్టం చేసింది. ఈ మేరకు పక్కా పైకప్పు ఉన్న ఇంటిలో ఉన్న వారి దరఖాస్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలైన గందరగోళం ఇప్పుడు మొదలైంది.
సొంత జాగా ఉన్నా, సొంతిల్లు లేని పేదలు అద్దె ఇళ్లలో ఉంటూ, ఆ ఇంటికి ఆర్‌సీసీ (పక్కా) పైకప్పు గనక ఉంటే.. ఇందిరమ్మ ఇంటి బిల్లులు మంజూరు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ నిరాకరిస్తోంది. అలా ఆర్‌సీసీ పైకప్పు ఉన్న ఇళ్లలో అద్దెకు ఉండే వారిని ఎల్–3 (అర్హతలపై అనుమానాలున్న వారితో రూపొందించిన జాబితా) జాబితాలోకి చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
ఇల్లు మంజూరు.. బిల్లుల తకరారు!
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఓ తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం దరఖాస్తుల్లోని చిరునామాల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి అర్హతలను తేల్చి సిఫారసు చేసింది. ఆ సమయంలో, సొంత జాగా ఉండి, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉండే పేదలను గుర్తించి సానుకూల నివేదికలు సమర్పించింది. ఆర్‌సీసీ పైకప్పు ఉన్న అద్దె ఇళ్లలో ఉన్నప్పటికీ, పేదలే కావటంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు.
అప్పట్లో అద్దె ఇంటికి ఆర్‌సీసీ పైకప్పు ఉంటే అర్హులు కాదన్న విషయాన్ని స్పష్టం చేయ లేదు. దాంతో సిబ్బంది పట్టించుకోలేదు. ఇళ్లు మంజూరు కావ టంతో లబి్ధదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. తీరా బిల్లులు మంజూరు చేయాల్సి వచ్చేసరికి ఆర్‌సీసీ పైకప్పు ఉన్న ఇళ్లలో అద్దెకుంటున్నారన్న విషయాన్ని ఎత్తిచూపు తున్నారు. బిల్లులు మంజూరు చేయడం లేదు.
అప్పుడే చెప్పి ఉంటే సరిపోయేది..
ఆర్‌సీసీ పైకప్పు (పక్కా ఇల్లు) ఉన్న ఇంటికి అద్దె కాస్త ఎక్కువే ఉంటుంది. ఆ కిరాయిని భరించే స్తోమత ఉందంటే నిరుపేదల్లో నిరు పేద అయి ఉండరు అన్నది ఇప్పుడు అధికారుల అభ్యంతరానికి కారణం. అయి తే దీన్ని ముందుగానే చెప్పి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. తీరా ఇళ్లు నిర్మించుకున్నాక బిల్లులు మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
అధికారుల చుట్టూ తిరుగుతూ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం ఉండటం లేదు. ఈ విషయంలో తాము సొంతంగా నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎటూ తేల్చకపోవటంతో అలాంటి లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.


