వింగ్స్ ఇండియా కార్యక్రమంలో అబ్బురపరిచిన విమానాల విన్యాసాలు
లోకల్ నుంచి గ్లోబల్ దిశగా ఎదుగుతున్నాం
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి
వైఎస్ హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ విమాన కేంద్రంగా ఎదిగేందుకు పునాది: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఏవియేషన్ పవర్‌హౌస్‌గా భారత్ వృద్ధి చెందుతోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. భారతదేశం విమానాలను ఎగురవేయడానికి మాత్రమే పరిమితం కాదన్నారు. విమానాల డిజైన్, తయారీ, కనెక్టివిటీ, సస్టైనబిలిటీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ తదితర రంగాల్లో గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా భారత్ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. ప్రధాని మోదీ ముందుచూపుతోనే భారత్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. ‘వింగ్స్ ఇండియా కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 120 దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 500 వాణిజ్య సమావేశాలు జరిగాయి. 1,700 విమానాల ఆర్డర్లు పెట్టారు’అని రామ్మోహన్ నాయుడు వివరించారు. వింగ్స్ ఇండియా ప్రోగ్రాం విజయవంతం కావడం సంతోషాన్నిచి్చందన్నారు.
తెలంగాణ భాగస్వామిగా..: భట్టి
భారత విమానయానం విశేషమైన దశలో నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘మనం కేవలం విమానాల కొనుగోలు దేశంగా మాత్రమే కాదు, రూపకర్తలుగా, తయారీదారులుగా, నిర్వహణ నిపుణులుగా, ఆవిష్కర్తలుగా ఎదుగుతున్నాం. డిజైన్ నుంచి అమలు వరకు, తయారీ నుంచి నిర్వహణ వరకు, భద్రత నుంచి స్థిరత్వం వరకు లోకల్ నుంచి గ్లోబల్ తయారీ దిశగా ఎదుగుతున్నాం. ఇది ఒక నిర్మాణాత్మక మార్పు, ఇందులో తెలంగాణ భాగస్వామిగా ఉండటం గర్వకారణంగా ఉంది’అని చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విమానయానాన్ని వ్యూహాత్మక రంగంగా గుర్తించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మౌలిక సదుపాయాలు, అనుసంధానం, పారిశ్రామిక సామర్థ్యాలపై భారీ పెట్టుబడులు వచ్చాయి. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్పుడే రూపుదిద్దుకుంది. హైదరాబాద్ గ్లోబల్ విమానయాన కేంద్రంగా ఎదగడానికి అదే పునాది. అప్పటి పెట్టుబడుల ఫలితాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం’అని భట్టి పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, స్థిరత్వం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. వాటర్ ఏరోడ్రోమ్స్, హెలి టూరిజంతోపాటు ఎయిర్ అంబులెన్స్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు
మామునూరు ఎయిర్‌పోర్టు కోసం 300 ఎకరాల అప్పగింతపై డిప్యూటీ సీఎం భట్టి
పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడుకు పత్రాల అందజేత
ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులనూ త్వరగా పూర్తి చేయాలని వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణ చేపట్టామని.. ఆ భూములను పౌర విమానయాన శాఖకు అప్పగించడంతో ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాత్రి బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన 300 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2007లోనే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఒప్పందం కుదిరినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని భట్టి విమర్శించారు.
మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లోనూ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో పౌర విమానయాన మంత్రిగా ఉండటం అభినందనీయమన్నారు. తెలంగాణ అవసరాలను గుర్తిస్తూ అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మామునూరులో స్వాతంత్య్రం కంటే ముందు నుంచి 1981 వరకు ఎయిర్‌పోర్టు ఉండేదని చెప్పారు. 696 ఎకరాల భూమి ఎయి ర్‌పోర్టు అథారిటీ వద్ద ఉందని.. రన్‌వే కోసం మరో 200 ఎకరాల భూమి కావాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు.
ఇక తమ పనే మిగిలిందని.. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


