
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక ప్రణాళిక
84 శాతం మందికి సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం
ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
దేవాదుల పంప్‌హౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును రేండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన హనుమకొండ జిల్లాలో పర్యటించారు.
మొదట హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపుహౌస్ స్టేషన్‌ను సందర్శించారు. తర్వాత ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను పరిశీలించారు. అక్కడి నుంచి భద్రకాళి చెరువుకు చేరుకుని పూడికతీత పనుల గురించి తెలసుకున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రుల సమీక్ష నిర్వహించారు.
84 శాతం జనాభాకు సన్నబియ్యం
రాష్ట్రంలో 84 శాతం జనాభాకు సన్నబియ్యంతో కడుపునిండా భోజనం పెడుతున్న ఘతన తమ ప్రభుత్వానిదేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు సీజన్లలో ఇప్పుడు తెలంగాణలో పండినంత ధాన్యం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పండలేదని అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, మూడు లక్షల మందికి కార్డులు అందజేస్తామని తెలిపారు.
సమ్మక్క సారక్క బరాజ్‌కు గోదావరి జలాలను 40 శాతానికిపైగా కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఛత్తీస్‌గఢ్ సీఎంతోనూ చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించేందుకు ఏడాదికి రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు, అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి రైతన్నలకు సమృద్ధిగా నీరందిస్తామని తెలిపారు.
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, కేఆర్.నాగరాజు, సత్యనారాయణరావు, మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి వరంగల్ మేయ ర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.