ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే! | Uttam Kumar Reddy fires on ktr | Sakshi
Sakshi News home page

ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే!

Jul 6 2026 4:10 AM | Updated on Jul 6 2026 4:10 AM

Uttam Kumar Reddy fires on ktr

కేటీఆర్‌ ధోరణి ఆ విధంగా ఉందంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌ 

కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణం, కూలిపోవడం వారి హయాంలోనే జరిగింది 

భద్రాచలం పట్టణం, ఆలయంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయి 

మీరు ఇదే కోరుకుంటున్నారా? అంటూ నిలదీత 

బరాజ్‌లు సరిగ్గా కట్టి ఉంటే ఎల్‌నినో పరిస్థితుల్లో పనికి వచ్చేదని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల డిజైన్ల తయారీ, నిర్మాణం, కూలిపోవడం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, బరాజ్‌ల వైఫల్యానికి నాటి సీఎం, ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులే బాధ్యులని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ తేల్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని, సీకెంట్‌ పైల్స్, స్టిల్లింగ్‌ బేసిన్‌ల నిర్మాణంలో తప్పిదాలే ప్రధాన కారణమని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కమిటీ నివేదించిందని చెప్పారు. అయినప్పటికీ ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’ అన్న తరహాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధోరణి ఉందని మంత్రి మండిపడ్డారు. 

బరాజ్‌ల భద్రత ప్రమాదంలో ఉందని, నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్‌ఏ కమిటీ హెచ్చరించిందని గుర్తు చేశారు. ఒకవేళ నీళ్లను నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం పట్టణం, ఆలయంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని తెలిపారు. ‘మీరు ఇదే కోరుకుంటున్నారా?’ అని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. కేటీఆర్‌ కంటే ఎన్డీఎస్‌ఏ నిపుణులకు కొద్దిగా జ్ఞానం ఎక్కువ ఉందని భావించి బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేయడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శన నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

మీరే సరిగ్గా కట్టి ఉంటే.. 
‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా కట్టి ఉంటే ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇంత దురదృష్టకరమైన దుస్థితి ఉండేది కాదు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును ఇష్టమొచి్చనట్లు నిర్మించారు.  కాళేశ్వరం చేపట్టకుండా రూ.38,500 కోట్లతో ప్రాణహిత–చేవెళ్లను పూర్తి చేసి ఉంటే ఎల్‌నినో పరిస్థితుల్లో సైతం తెలంగాణ సస్యశామలమయ్యేది. బీఆర్‌ఎస్‌ పాలకుల ఘోర తప్పిదంతోనే మూడు బరాజ్‌లు పనికి రాకుండా పోయాయి. ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికలూ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 

తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ లొకేషన్‌ మార్చి రాష్ట్రానికి ద్రోహం చేశారు. నిర్మాణం పూర్తైన కొన్ని రోజులకే మూడు బరాజ్‌లలో లోపాలు, సీపేజీలు బయపడ్డాయి. అయినా మరమ్మతులు చేయకుండా గత సర్కారు నిర్లక్ష్యం చేసింది. మరమ్మతుల కోసం బరాజ్‌లలో నీళ్లను ఖాళీ చేసేందుకు గత ప్రభుత్వ పెద్దలు అనుమతించలేదు. అంతేకాదు..పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. వ్యవస్థ కుప్పకూలిపోయింది. బీఆర్‌ఎస్‌ వాళ్లు ఏది ముడితే అది నాశనమైంది. 

మన పిల్లలు, వారి పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టి అధిక వడ్డీలతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తెచ్చారు. దేశంలో మరే రాష్ట్రం చేయనంతగా రూ.1.81 లక్షల కోట్లను కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ఎకరం కూడా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురాలేదు..’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.  

2027 ఆగస్టు నాటికి బరాజ్‌ల పునరుద్ధరణ 
‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లకు పరీక్షలు, మరమ్మతులను పూర్తి చేసి 2027 జూలై/ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వినియోగంలోకి తెస్తాం. మూడు బరాజ్‌లకు రక్షణగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంతో పాటు స్టిల్లింగ్‌ బేసిన్‌ సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని అంచనా వేశాం. నెల రోజుల్లో బరాజ్‌ల పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేసి పనులను ప్రారంభిస్తాం..’ అని మంత్రి తెలిపారు.

కాగా బరాజ్‌లకు గేట్లను దింపితేనే నీళ్లను పంపింగ్‌ చేయడానికి వీలుంటుందని, ప్రస్తుతం గేట్లు దింపే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్‌ చెప్పారు. నీటిపారుదల శాఖ సలహాదారులతో కలిసి ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన అన్ని రకాల టెస్టులను పకడ్బందీగా నిర్వహిస్తుండడంతోనే పునరుద్ధరణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సొరంగాల నిపుణులు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement