
కృష్ణాలో వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి
ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంను ఆశ్రయిస్తామన్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా 763 టీఎంసీలు దక్కాలని, ఈ వాటాను రాబట్టుకునేలా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలోని పరీవాహక ప్రాంతం, కరువు ప్రాంతాలు, జనాభా ప్రాతిపదికన వాటాలు ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ‘కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి మొత్తంగా 1,050 టీఎంసీల నీటిని కేటాయించింది.
ఇందులో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా 811 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీలో 49 టీఎంసీలు, సగటు ప్రవాహాల్లో 145 టీఎంసీలతోపాటు గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 70శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నాం. అందులో 75శాతం డిపెండబులిటీ కింద 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీ కింద 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల కింద 120, గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 763 టీఎంసీలు కోరుతున్నాం’అని ఉత్తమ్ తెలిపారు. మంగళవారం మొదలైన ట్రిబ్యునల్ విచారణకు మంత్రి స్వయంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీకి జరిగిన 811 టీఎంసీలను ఎక్కువగా బేసిన్ బయట ఉన్నవాటికే కేటాయించారని, ఈ నీటిని తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు అందించేలా న్యాయం చేయాలని ట్రిబ్యునల్‌ను కోరుతున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా రాసిచ్చారని, ఈ అన్యాయాన్ని సవరించాలని తాము కోరుతున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
ఆల్మట్టిపై సుప్రీంలో కొట్లాడతాం
కర్ణాటక నిర్ణయించిన ఆల్మట్టి ఎత్తు పెంపును సైతం తాము అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ విషయమై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా నీటి వాటాల విషయంలో తెలంగాణ రాజీపడదని, ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు.