Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు.. ఎదురులేని కేటీఆర్‌.. కొప్పుల ఈశ్వర్‌కు గట్టిపోటీ.. ఈటల పరిస్థితి ఏంటీ?

Ugadi 2023: Karimnagar Leaders KTR Etela Gangula Future Horoscope - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్‌ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే..

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ మంత్రి గంగుల కమలాకర్‌ తీగల వంతెన, ఎమ్మారెఫ్‌, స్మార్ట్‌ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్‌ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ మనవడు రోహిత్‌, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. వైస్సార్‌టీపీ నుంచి డాక్టర్‌ నగేశ్‌ బరిలో నిలవనున్నారు.

చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్‌ (బీఆర్‌ఎస్‌)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్‌టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్‌ బరిలో నిలవనున్నారు.

మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్‌ కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు.

హుజూరాబాద్‌: గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్‌ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది.

రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్‌ నేత ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ (కాంగ్రెస్‌) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది.

వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ (బీఆర్‌ఎస్‌)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌ రావు కుమారుడు వికాస్‌ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్‌ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్‌ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు.

జగిత్యాల: డాక్టర్‌ సంజయ్‌ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు.

కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు(బీఆర్‌ఎస్‌) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్‌) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ (బీఆర్‌ఎస్‌)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది.

పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్‌ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు.

మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్‌)కు, పుట్ట మధు (బీఆర్‌ఎస్‌)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top