విద్యుత్‌ కార్మికులకు కరెంట్‌ షాక్‌.. | two die after electrocution in jagtial district | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కార్మికులకు కరెంట్‌ షాక్‌..

Jun 15 2025 2:06 AM | Updated on Jun 15 2025 2:06 AM

two die after electrocution in jagtial district

ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాలో వేర్వేరు ఘటనలు

మరో ఘటనలో సిరిసిల్ల జిల్లాలో కరెంట్‌ షాక్‌తో కూలీ దుర్మరణం  

డోర్నకల్‌ /కేసముద్రం/నల్లబెల్లి/ముస్తాబాద్‌ (సిరిసిల్ల) /మల్లాపూర్‌: ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు విద్యుత్‌ ప్రమాదాల్లో నలుగురు విద్యుత్‌ కార్మికులు కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. అందులో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, సిరిసిల్ల జిల్లాలో కిందపడిన విద్యుత్‌ తీగను సరిచేస్తూ షాక్‌కు గురై ఓ కూలీ మరణించాడు. 

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటకు చెందిన బి.క్రాంతికుమార్‌ (32) ఐదేళ్లుగా డోర్నకల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మున్నేరువాగు వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేయడానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలంటూ ప్రత్యేక యాప్‌ ద్వారా అనుమతి కోరగా.. సరఫరా నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి వెళ్లి మరమ్మతు చేస్తుండగా విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. అతడిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

పోల్‌పైనుంచి పడి జేఎల్‌ఎం దుర్మరణం
విద్యుత్‌ స్తంభంపైకెక్కి తీగలు సరిచేస్తుండగా కరెంట్‌ షాక్‌తో జూనియర్‌ లైన్‌మెన్‌ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన దుంపేట రాజేశం (40) కొత్తదాంరాజుపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వాల్గొండలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో కరెంట్‌ సరఫరా కావడంతో విద్యుత్‌ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందపడి మృతిచెందాడు. 

కరెంట్‌షాక్‌తో కూలీ దుర్మరణం
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి రాజయ్య(48) ఇంట్లో శనివారం విద్యుత్‌ సర్వీస్‌ తీగ తెగిపడింది. దానిని పక్కకు తీస్తూ షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు ముస్తాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాజయ్య భార్య గతంలోనే చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

మరో రెండు ఘటనల్లో ఇద్దరికి గాయాలు..
వరంగల్‌ జిల్లా పంతులుపల్లికి చెందిన నీలం శ్రీనివాస్‌ అన్‌మ్యాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గోవిందాపూర్‌ ఫీడర్‌లో ఎల్‌సీ తీసుకుని శివారు లైన్‌తండాలో ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు పనులు చేపడుతున్నాడు. అయితే ఏఎల్‌ఎం బాసు.. మద్యం మత్తులో ఉండి ఎల్‌సీ తీసుకున్న విషయం మరిచిపోయి ఫీడర్‌ను ఆన్‌ చేశాడు. దీంతో శ్రీనివాస్‌ విద్యుత్‌ షాక్‌కు గురై గాయపడ్డాడు. ఏఎల్‌ఎం బాసు మద్యం తాగినట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో ఘటనలో మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ బూర్గుల అంబేడ్కర్‌ రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి సమీప వ్యవసాయక్షేత్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించే క్రమంలో షాక్‌కు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఆస్పత్రికి పంపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement