కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి | 20 dead and 90 injured in Kyiv as Ukraine hit with massive Russian strike | Sakshi
Sakshi News home page

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

Jul 3 2026 5:35 AM | Updated on Jul 6 2026 3:30 PM

20 dead and 90 injured in Kyiv as Ukraine hit with massive Russian strike

20 మంది మృతి

90 మందికి గాయాలు

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా గురువారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌ తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఇది ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. 24 బాలిస్టిక్‌ రకంసహా మొత్తంగా 74 క్షిపణులు, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్‌ వాయుసేన పేర్కొంది.

ఏకధాటిగా 11 గంటలపాటు రష్యా డ్రోన్లు, క్షిపణి దాడుల కారణంగా కీవ్‌ నగరంలో పేలుళ్ల మోత మోగింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్‌వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గినట్టు కీవ్‌ నగర మేయర్‌ విటాలి క్లిషెకో వెల్లడించారు. నగరంలో సుమారు 30 చోట్ల భారీ నష్టం జరిగింది. 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలాయి.

16 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాడుల అనంతరం సహాయక బృందాలు, భవనాల శిథిలాల్లో బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉక్రెయిన్‌ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement