‘సొమ్ము’సిల్లుతున్న విశ్రాంత ఉద్యోగులు

TSRTC Retired Employee Concern Over CCS Deposits - Sakshi

వడ్డీ చెల్లింపు నిలిపివేత 

సీసీఎస్‌లో డిపాజిట్లు.. దాని వడ్డీనే ఆధారం 

ఆర్టీసీ నిర్వాకంతో తీవ్ర ఆందోళనలో రిటైర్డ్‌ ఉద్యోగులు 

సాక్షి, హైదరాబాద్‌: వెంకటయ్య ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.. పదేళ్ల కింద పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్‌ సమయంలో వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్‌)లో డిపాజిట్‌ చేశారు. ఇప్పుడు వెంకటయ్య దంపతులు ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వడ్డీ రావటం ఆగింది. సీసీఎస్‌ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే, ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 7 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్‌కు జమ చేయాల్సిన మొత్తం సరిగా రావటం లేదన్నారు.

అందుకే వడ్డీ చెల్లించేందుకు డబ్బు లేదన్న సమాధానం వచ్చింది. తన డిపాజిట్‌ మొత్తం తిరిగి ఇమ్మంటే.. ఆర్టీసీ బకాయి పడ్డ మొత్తం చెల్లిస్తేగాని ఇవ్వలేమని చెప్పడంతో ప్రతినెలా నెట్టుకొచ్చేది ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక వెంకటయ్య దుస్థితే కాదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొంది తమ రిటైర్మెంట్‌ సాయం మొత్తాన్ని సీసీఎస్‌లో దాచుకున్న దాదాపు 8 వేల మంది ఆవేదన.

ఇందులో దాదాపు 4వేల మంది సీసీఎస్‌ అందించే వడ్డీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆందోళనలో ఉన్న ఈ ఉద్యోగులు రోడ్డెక్కబోతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ అందించే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ సీసీఎస్‌ నుంచి బస్‌భవన్‌ వరకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.  

రావాల్సిన రూ.25 కోట్లు రాకపోవడంతో.. 
ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్‌ అయిన తర్వాత.. నెలనెలా సీసీఎస్‌లో జమ చేసుకున్న మొత్తంతో పాటు వడ్డీ పొందుతారు. దీన్ని చాలా మంది సీసీఎస్‌లోనే డిపాజిట్‌ చేసి వడ్డీ పొందుతుంటారు. దాన్నే పింఛన్‌లా భావిస్తుంటారు. ఇలా ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల మొత్తం సీసీఎస్‌లో రూ.250 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతంలోంచి మినహాయించే 7 శాతం మొత్తం నెలకు రూ.25 కోట్లవుతుంది.

దీన్ని ప్రతినెలా ఆర్టీసీ సీసీఎస్‌కు సరిగా చెల్లించలేకపోతోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీగా చెల్లించాల్సిన నెలవారీ మొత్తం రూ.2.5 కోట్లు చెల్లించడం సీసీఎస్‌కు కష్టంగా మారి.. నిలిపివేసింది. విశ్రాంత జీవితంలో చీకూచింతా లేకుండా గడపాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏడాది క్రితం ఇలాంటి సమస్యే ఏర్పడి కొన్ని నెలల పాటు వీరికి వడ్డీ అందలేదు. సజ్జనార్‌ ఎండీగా వచ్చిన తర్వాత సమస్య పరిష్కారమైంది. మళ్లీ ఇప్పుడు ఎదురుకావటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top