ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్‌

TSRTC Process Of Voluntary Retirement Of Employees - Sakshi

వీఆర్‌ఎస్‌ చెల్లింపులపై స్పష్టతనిచ్చిన సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారంలో ఆర్టీసీ వేగాన్ని పెంచింది. ఇటీవలే దాదాపు 3100 మంది వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. వీఆర్‌ఎస్‌ తీసుకుంటే, వచ్చే ఆర్థిక ప్రయోజనాలను స్పష్టం చేస్తూ ఆర్టీసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  

చెల్లింపులు ఇలా... 
వీఆర్‌ఎస్‌ తీసుకున్న రోజు వరకు అర్హత ఉన్న గ్రాట్యుటీ వడ్డీతో కలిపి చెల్లిస్తారు.  
పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగి వితరణ, యాజమాన్యం వితరణ మొత్తాలను వీఆర్‌ఎస్‌ తీసుకునే నాటికి లెక్కించి జత చేసి చెల్లిస్తారు.  
పదేళ్లకు పైగా సర్వీసు ఉన్న వారికి కనిష్టంగా రూ.వేయి చొప్పున పెన్షన్‌ చెల్లిస్తారు.  
స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం, స్టాఫ్‌ బెన్వెలెంట్‌ కమ్‌ థ్రిఫ్ట్‌ స్కీం కింద ఉద్యోగి అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందిస్తారు. 
300 ఆర్జిత సెలవులకు రావాల్సిన మొత్తం లేదా వాస్తవంగా ఖాతాలో క్రెడిటైన అసలు ఈఎల్స్‌ మొత్తం రెంటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు.  
నోటీసు కాలానికి సంబంధించిన వేతనం చెల్లిస్తారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్నాక మిగిలిపోయిన సర్వీసు కాలం ఐదేళ్లలోపు ఉంటే వేతనం + చివరిసారి పొందిన కరువు భత్యం ఇంటూ 15/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములాతో చెల్లిస్తారు.  ఐదేళ్లకు పైబడి–పదేళ్లలోపు సర్వీసు ఉంటే పే + చివరిసారి పొందిన కరువుభత్యం ఇంటూ 20/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం చెల్లిస్తారు.  

పదేళ్లకుపైబడి సర్వీసు ఉంటే పే +చివరి డీఏ ఇంటూ 25/26 ఇంటూ పదేళ్ల మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం లెక్కించి చెల్లిస్తారు.  ఇక నోషనల్‌ గ్రాట్యుటీకి సంబంధించి ఐదేళ్ల గరిష్ట మొత్తం లేదా మిగిలిన సర్వీసు కాలానికి లెక్కించిన మొత్తం.. వీటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ఉద్యోగి వాటా నోషనల్‌ పీఎఫ్‌కు.. ఐదేళ్ల గరిష్ట సర్వీసు లేదా మిగిలిన సర్వీసు.. ఏది తక్కువో అది లెక్కించి చెల్లిస్తారు.  

బస్‌పాస్‌: సిటీలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌వరకు, జిల్లా సర్వీసుల్లో డీలక్స్‌ కేటగిరీ వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. సూపర్‌ లగ్జరీ ఆపై కేటగిరీల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించొచ్చు. ఉద్యోగి మరణించాక ఇదే రాయితీ స్పౌజ్‌కు వర్తిస్తుంది. 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్స్‌ మొత్తాన్ని వడ్డీతోపాటు చెల్లిస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top