TS: జూలై 1న గ్రూప్‌–4 పరీక్షలు

TSPSC Announced Group 4 Exaination Date Here Is Full Details - Sakshi

ఉదయం జనరల్‌ స్టడీస్‌.. మధ్యాహ్నం సెక్రటేరియల్‌ ఎబిలిటీ పరీక్షలు

ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటన 

ఇంగ్లిష్‌–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూలలో ప్రశ్నపత్రాలు 

నేటి సాయంత్రంతో ముగుస్తున్న దరఖాస్తు గడువు 

ఒక్కో పోస్టుకు 110 మందికిపైగా పోటీ 

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా ఉద్యోగ భర్తీ ప్రకటనలతో రెండు నెలలపాటు హడావుడి చేసిన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇక పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. ఇటీవలే గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్ష తేదీలను ఖరారు చేయగా.. అత్యధిక పోస్టులున్న గ్రూప్‌–4 పరీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్‌–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని.. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూలలో ఉంటాయని పేర్కొంది. 

ఎక్కువ పోస్టులు చూపి.. కొన్ని తగ్గించి.. 
వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్‌–4 పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్‌ 1న టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్‌ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. 8,039 ఖాళీ పోస్టులను మాత్రమే చూపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. తర్వాత ఈ ఏడాది జనవరి 28న విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్‌తో మరో 141 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను జత చేసింది. వీటితో కలిపి మొత్తంగా భర్తీ చేసే గ్రూప్‌–4 పోస్టుల సంఖ్య 8,180కి చేరింది.  

నేటితో గడువు పూర్తి 
గ్రూప్‌–4 పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు 9 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక్కో పోస్టుకు 110 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. 

రెండు పేపర్లు.. 300 మార్కులు.. 
గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు ఉంటాయి. ఇందులో జూలై 1న ఉదయం జనరల్‌ స్టడీస్‌ పరీక్ష, మధ్యాహ్నం సెక్రటేరియల్‌ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటలు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ప్రతి పేపర్‌కు 150 మార్కులు.. రెండు పరీక్షలు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ వివరాలను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top