సెకండ్‌ వేవ్: కరోనా మార్గదర్శకాలు

TS Govt Release Coronavirus Control Latest Guidelines For Second Wave - Sakshi

కరోనా నియంత్రణ చర్యలపై సర్కారు కార్యాచరణ

జిల్లాలపై దృష్టి.. అధికారుల పర్యటన షురూ

మరోసారి వైద్య యంత్రాంగానికి దిశానిర్దేశం..

చలికాలం ప్రారంభం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు

ప్రజలకు సర్కారు తాజా మార్గదర్శకాలు విడుదల  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ‘సెకండ్‌ వేవ్‌’ దడ మొదలైంది. అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న ప్రకంపనలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను ఎదుర్కోవాలని నిర్ణయించింది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అధి కారులకు దిశానిర్దేశం చేయగా, వాటిని అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభిం చింది. ప్రజల్లో, వైద్యాధికారుల్లో కరోనా కట్టడిలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు ఉన్నతాధి కారులు నడుం బిగించారు. 

జిల్లాలపై ప్రత్యేక ఫోకస్‌..: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.42 లక్షలకు చేరుకుంది. తెలం గాణలో మార్చి 2 నుంచి మొదలైన కరోనా వ్యాప్తి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఉధృతి తక్కువగా ఉండటం, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కోలుకునేవారి రేటు 92.12 శాతానికి చేరుకోవడంతో ప్రజల్లోనూ, యంత్రాంగంలోనూ కాస్తంత నిర్లిప్తత నెలకొం దన్న చర్చ జరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పడిపోవడంతో జనాల్లో కరోనా పట్ల గతంలో ఉన్నంత ఆందోళన లేదు. అయితే కరోనా పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తు న్నాయి. కరోనా పూర్తి నియంత్రణకు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పదని చెబుతూనే ఉన్నారు. కానీ ఏమీ కాదన్న ధోరణి జనంలో ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. పైపెచ్చు ఇప్పుడు చలికాలం మొదలైంది.. ఈ కాలంలో సీజనల్‌ ఫ్లూ వ్యాధులు, దానికి తోడు కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

యూరప్, అమెరికా దేశాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అందుకే జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. పరిస్థితిని అంచనా వేసి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం నుంచి జిల్లాల్లో వైద్య ఉన్నతాధికారులు పర్యటన మొదలు పెట్టారు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి మంగళవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. కరోనా పరీక్షలు, చికిత్స చేసే ఆసుపత్రులను పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సెకండ్‌ వేవ్‌ రాకుండా చేపట్టాల్సిన ప్రణాళికను వారు వివరించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్‌ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని కరోనా కట్టడి చేయాలని సూచించారు. మరోవైపు డెంగీ, మలేరియా వంటి వంటి సీజనల్‌ వ్యాధులతోనూ కరోనా వచ్చే ప్రమాదం ఉందని, అటువంటి కేసులను గుర్తించాలన్నారు. ఇక కరోనాపై తాజాగా రూపొందించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

కరోనా తాజా మార్గదర్శకాలివే..
–సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఉన్నందున అవసరమైతేనే ఎవరైనా ఇంటి నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే శ్రేయస్కరం.
–పండుగలు, శుభకార్యాలు ఏవైనా అందరూ ఒకేచోట చేరడం మంచిది కాదు. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవాలి.. 
–చలికాలంలో డెంగీ, మలేరియా సహా ఫ్లూ జ్వరాలతో కలిపి కరోనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఏమాత్రం లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు. 
–కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ లక్షణాలుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలి. అటువంటివారు ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. 
–ఐసోలేషన్‌లో ఉండే గదికి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.
–ఎప్పటికప్పుడు జ్వరాన్ని చెక్‌ చేసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు వస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.
–ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. 
–ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించకూడదు. 
–కూరగాయలు, పండ్లను బేకింగ్‌ పౌడర్‌ కలిపిన నీటితో కడగాలి. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. 
–రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. పసుపు వేసిన వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
–కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. 
–ఇంట్లో ఖాళీగా ఎవరూ కూర్చోకూడదు.. అంటే ప్రాణాయామం, ధ్యానం చేస్తుండాలి.. సంగీతం వినడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడమూ చేయాలి.

కరోనా టెస్టుల పెంపు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంతలు, రైతుబజార్లు, బస్టాండ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పని ప్రదేశాల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని నిర్ణయించారు. సహజంగా చలికాలంలో అన్ని రకాల వైరస్‌లు విజృంభిస్తుంటాయి. ఇక కరోనా లాంటివి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే రాబోయే మూడు మాసాలు అత్యంత కీలకమని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఐదారు మాసాలు సమయం పడుతుందని, అప్పటివరకు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించేలా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు ప్రజల్ని చైతన్య పరుస్తూ.. మరోవైపు వారు భయపడకుండా, ఆందోళన చెందకుండా అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top